26 July 2017

రూ.2వేల నోటు ప్రింటింగ్ ఆపారా?

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్ద నోట్లగా చెలామణిలో ఉన్న రూ.500.. రూ.1000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ.. ఆ తర్వాత వాటి స్థానంలో రూ.2వేల నోటును తీసుకురావటం తెలిసిందే. కొద్ది రోజులకే రూ.500 నోటును తీసుకొచ్చినా.. వెయ్యి నోటును పునరుద్ధరించలేదు. ఇదిలా ఉండగా.. త్వరలో రూ.200 నోటును తీసుకురావాలన్న నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి నేపథ్యంలో ఆర్ బీఐ రూ.200 నోట్ల ప్రింటింగ్ ను షురూ చేసింది. అన్ని బాగుంటే ఆగస్టు 15 నాటికి కొత్త రూ.200 నోటును వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. అయితే.. అనుకున్న రీతిలో ప్రింటింగ్ జరగటం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఒకదశలో ఆగస్టు నుంచి దసరా సమయానికి రూ200 నోట్లను తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్న వార్తల స్థానే.. మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. సరికొత్తగా తీసుకు వస్తున్న రూ.200 నోట్ల ప్రింటింగ్ ను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసినట్లుగా సమాచారం. రూ.200 నోట్ల ప్రింటింగ్ ను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 15 నాటికి కొత్త రూ.200 నోటను చెలామణిలోకి తెచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి.. రూ.200 నోట్ల కోసం రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ఆపితే.. కొరత ఏర్పడుతుందా? దాని వల్ల జరిగే ఇబ్బంది ఏమిటన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. మిగిలిన ముచ్చట్లు ఎలా ఉన్నా.. మరో మూడు వారాల వ్యవధిలో కొత్త కొత్త రూ.200 నోటు జేబుల్లోకి రావటం ఖాయమన్నట్లేనా?

No comments:

Post a Comment