11 August 2017

ఆమె వల్ల నంద్యాలలో టీడీపీకి మైనస్సేనా?

తండ్రి నియోజకవర్గంలో గెలుపు కోసం కూతురు అష్టకష్టాలు పడుతోంది. టీడీపీని గెలిపించేందుకు 25 మంది ఎమ్మెల్యేలు - మంత్రులు.. ఇలా అందరినీ సీఎం చంద్రబాబు మోహరించేశారు. నంద్యాలలో గెలుపు కోసం మంత్రి భూమా అఖిలప్రియ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆమె అవగాహనా రాహిత్యం అనుభవలేమి ఇప్పుడు వీరందరికీ షాక్ ల మీద షాకులిచ్చేలా చేస్తోంది. అంతేగాక సీనియర్లను పార్టీకి దూరం చేస్తోంది. తొలి నుంచి ఆమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీనియర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆమెను ముందుంచి సానుభూతి ఓట్లు పొందాలని భావిస్తున్న టీడీపీ నేతలకు.. ఇప్పుడు తత్వం బోధపడుతోందట. ఆమె వల్ల పార్టీకి మైనస్ అని కొందరు ఆందోళన చెందుతున్నారట. నంద్యాలలో టీడీపీ - వైసీపీ పోరు తీవ్రంగా ఉంది. విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే టీడీపీ తరఫున ఇక్కడ గెలుపొందే బాధ్యత అంతా భూమా అఖిలప్రియపై పెట్టేశారు సీఎం చంద్రబాబు! అందుకే అన్న గెలుపును తన గెలుపుగా భావించి.. ప్రచారంలోకి దూకేశారు. తొలి నుంచి ఆమె వ్యవహార శైలిపై సీనియర్లు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే! ఇప్పుడు ఇది మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా పార్టీలో చేరుతున్న వారి విషయంలో ఆమె ఏమాత్రం తమను సంప్రదించడం లేదని వీరంతా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో చేరుతున్నారన్న సంతోషపడుతున్న సమయంలోనే మరోసారి అలకలు కూడా టీడీపీని కలవరపెడుతున్నాయి. `మా అన్న ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా` అంటూ ప్రకటించిన నాటి నుంచి నంద్యాలలో గెలుపుకోసం కష్టపడుతున్నారు భూమా నాగిరెడ్డి కూతురు - మంత్రి అఖిలప్రియ. ఆమె పార్టీ సీనియర్లతో చర్చించకుండా ఒంటెత్తు పోకడగా వ్యవహరించడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభముండదని సీనియర్లు తెగేసి చెబుతున్నారట. నంద్యాలలో ఒక విద్యాసంస్థల అధినేత ఇంతియాజ్ ను అఖిలప్రియ పార్టీలో చేర్చుకున్నారు. సీఎం సమక్షంలోనే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇంతియాజ్ వ్యతిరేక వర్గం ఇప్పుడు భూమా ఫ్యామిలీకి వ్యతిరే కం గా మారింది. ఇంతియాజ్ ఒక విద్యాసంస్థకు అధిపతి అయితే… మరో విద్యాసంస్థకు అధిపతి రామకృష్ణారెడ్డి అలకబూనారు.
ఉప ఎన్నికకు రోజులు సమీపిస్తున్న కొద్దీ.. నంద్యాలలో అధికార టీడీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. ఇక్కడ గెలుపు వైసీపీ అభ్యర్థిదేనని స్పష్టమైపోవడంతో టీడీపీ నేతలు తమ అధికారాన్ని - అధికారులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతిస్తున్నవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన సంఘటన నంద్యాలలో సంచలనం సృష్టించింది. స్థానికుడైన రమేశ్బాబు.. మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఈయన వైసీపీ అభ్యర్థి శిల్పాకు ప్రత్యేక అభిమాని ఆయనకు మద్దతుదారు కూడా. టీడీపీలో శిల్పా ఉన్నప్పటి నుంచి కూడా రమేశ్ బాబు మద్దతుదారే. అయితే అనూహ్యంగా శిల్పా ఇప్పుడు వైసీపీలోకి మారేసరికి పోలీసులు ఒక్కసారిగా రమేశ్ బాబుపై నిఘాను పెంచేశారు. అంతేకాదు ఈయన మెడికల్ స్టోర్ - ఇంటిపై అర్ధరాత్రి వేళ దాడికి పాల్పడ్డారు. మెడికల్ షాపులో ఉంచిన లయన్స్ క్లబ్ కు చెందిన రూ.3.57 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో రమేశ్బాబు.. ఆ డబ్బులు లయన్స్ క్లబ్ వాళ్లవని వాళ్లు కట్టిన చందా రశీదులు కూడా ఉన్నాయని చూపించినా .. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రమేశ్ బాబు అధికార పార్టీ దాష్టీకంపై విరుచుకుపడ్డారు. అర్థరాత్రి తమ ఇంటికి వచ్చి కిటికీ పగలగొట్టి పోలీసులు లోపలకు చొచ్చుకొచ్చారని చెప్పారు. తాను ఎటువంటి రాజకీయ ప్రచారం చేయలేదని తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డి మద్దతుదారులమన్న ఏకైక కారణంతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇదే ఘటనపై స్పందించిన వైసీపీ నేత - ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ అరాచకాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేసినా తమ కార్యకర్తలు భయపడరని ఉద్ఘాటించారు. అర్థరాత్రి వ్యాపారి రమేశ్ ఇంటి తలుపు బద్దలుకొట్టి డబ్బులు పట్టుకెళ్లారని సేవా కార్యక్రమాలకు చెందిన డబ్బు అని చెప్పినా పోలీసులు వినలేదని తెలిపారు. చంద్రబాబు బెదిరింపులు దౌర్జన్యాలు మానుకోవాలని హితవు పలికారు. మొత్తానికి అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు చెలరేగిపోతుండడాన్ని స్థానికులు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.

శిల్పా రాజీనామాపై ఇప్పుడప్పుడే తేల్చరా?

శిల్పా బ్రదర్స్లో చిన్నవాడైన శిల్పా చక్రపాణి రెడ్డి.. ఇటీవల నంద్యాలలో జరిగిన వైసీపీ బహిరంగ సభ సందర్భంగా పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన జగన్ మాటకు కట్టుబడి.. నైతిక విలువలకు తలవంచుతూ.. పదవుల కోసం పాకులాడకుండా తనకు టీడీపీ హయాంలో లభించిన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. వేదిక మీదే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. అదికూడా మండలి చైర్మన్ ఫార్మాట్ లోనే శిల్పా రాజీనామా చేసి.. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలకు గట్టి బుద్ధి చెప్పి.. నేటి తరం రాజకీయాలకు ఆదర్శంగా కూడా నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో శిల్పా సాహసానికి అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నైతికత - నైతిక విలువలు అని చెప్పుకోవడంతో సరిపుచ్చకుండా.. వాటిని తాను పాటిస్తూ.. తన వారితో పాటించేలా చేస్తున్న జగన్ కి జనాలు జైకొట్టారు. ఈ పరిణామం నిజంగా టీడీపీని చాలా చిక్కుల్లోకి నెట్టింది. నైతికత అనే పేరు ఎత్తడం కానీ నిజాయితీ అనే మాట అనేందుకు కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన చక్కటి ప్లాన్ వేశాడు. శిల్పా సమర్పించిన రాజీనామా విషయంలో మైండ్ గేమ్ కి తెరతీయాలని తన మందీ మార్బలాన్ని ప్రోత్సహించాడు. ఇంకేముంది.. అధినేత కనుసన్నల్లో పనిచేస్తూ.. ఆయన మెప్పుకోసం ఉవ్విళ్లూరే.. తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు శిల్పా చక్రపాణి బహిరంగ వేదికగా చేసిన రాజీనామాపై మైండ్ గేమ్ కి తెరతీశారు. వాస్తవానికి శిల్పా తన పదవికి రాజీనామా చేసి.. దానిని ఫ్యాక్స్ ద్వారా మండలి చైర్మన్ కి పంపారు. అదేసమయంలో శాసన మండలి కార్యదర్శికి కూడా ఈ లేఖ పంపించారు. అయితే ప్రస్తుతం మండలికి చైర్మన్ లేనందున డిప్యూటీ చైర్మన్ దీనిని ఆమోదించే వీలుంది. అయితే ఇక్కడే టీడీపీ నేతలు నాటకానికి తెరతీశారు. ప్రస్తుతానికి శిల్పా రాజీనామాను పెండింగ్ లో పెడతారని ఒకవేళ నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి ఓడిపోతే.. తిరిగి అన్నదమ్ములు ఇద్దరూ టీడీపీ గూటికే చేరిపోవడం ఖాయమని ఈ క్రమంలో ఇక తిరిగి తన ఎమ్మెల్సీని చక్రపాణి తీసుకుంటారని రాజీనామా రద్దు కోరతారని టీడీపీ నేతలు కొన్ని మీడియాకు లీకులిస్తున్నారు. రాజీనామా చేసిందీ లేనిదీ చక్రపాణిరెడ్డిని పిలిపించి మాట్లాడడం లేదా ఫోన్ లో మాట్లాడి నిర్ధారించుకోవలసి ఉంటుందని కూడా తమ్ముళ్ల కొత్తగా సూత్రీకరిస్తున్నారు. నిజానికి ఇదేమీ దొంగచాటుగానో.. పైపైకి జగన్ మెప్పుకోసమో చక్రపాణి చేసింది కాదు. నిజంగానే నైతికతకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారు. అదికూడా మండలి చైర్మన్ ఫార్మాట్ లో పంపారు. కాబట్టి.. దీనిని మళ్లీ పోస్ట్ మార్టమ్ చేయాలని భావించడం నిజంగా మైండ్ గేమేనని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే శిల్పా ఓ నిర్ణయం తీసుకున్నారని దానిని గౌరవంగా ఆమోదించకుండా.. టీడీపీ నేతలు ఇలా కొర్రులు పెట్టడం వారిలోని అనైతికతను తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. సో.. ఇలా టీడీపీ నేతలు మైండ్ గేమ్కి తెరతీశారన్నమాట.

మోడీ చెప్పిన వెంకయ్య స్పెషాలిటీ

సుదీర్ఘ విరామం తర్వాత తెలుగోడు అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. అప్పుడెప్పుడో పీవీ నరసింహరావు ప్రధాని పీఠం మీద కూర్చున్న ముచ్చట తెలిసిందే. ఆ తర్వాత ఇప్పటివరకూ మరో తెలుగోడికి అత్యున్నత స్థానం దక్కింది లేదని చెప్పాలి. ప్రోటోకాల్ ప్రకారం చూస్తూ దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు తెలుగు నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు. భారత 13వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సంబంధించిన అరుదైన రికార్డును ప్రధాని మోడీ ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన వ్యక్తి ఒకరు ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టటం ఇదే తొలిసారన్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని ప్రధాని మోడీ సభలో ప్రస్తావించారు. మోడీ నోటి నుంచి వచ్చిన ఈ మాట విన్నవెంటనే రాజ్యసభ సభ్యులంతా చప్పట్లతో తమ హర్షాతిరేకాల్ని వ్యక్తం చేశారు. 1949 జులై 1న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్లో వెంకయ్య చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నేరుగా రాజ్యసభకు వెళ్లిన వెంకయ్య రాజ్యసభ ఛైర్మన్ స్థానంలో కూర్చున్నారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ప్రధాని మోడీ.. విపక్ష నేత గులాం నబీ అజాద్ తో సహా ఇతర సభ్యులు అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన వారు ఉప రాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్యనాయుడిగా చెప్పారు. ఇదో అరుదైన సందర్భం.. కేంద్రమంత్రిగా వెంకయ్య దేశానికి ఎంతో సేవ చేశారన్నారు.ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం విజయవంతం అయిందంటే అందుకు వెంకయ్యను మాత్రమే అభినందించాలన్నారు. ఇన్నాళ్లు తమలో న్యాయవాదిగా ఉండి ఈ రోజు న్యాయమూర్తి స్థానంలో వెంకయ్య కూర్చున్నారన్నారు.

03 August 2017

వెనక్కి వెళ్లమన్న చైనాకు నో చెప్పిన భారత్

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తన చుట్టూ ఉన్న దేశాల్లోకి ఏదో రకంగా చొచ్చుకుపోయే దుర్మార్గ లక్షణం ఉన్న చైనా.. ఇటీవల కాలంలో చికెన్ నెక్ మీద దృష్టి పెట్టిన వైనం తెలిసిందే. చికెన్ నెక్ మీద పట్టు పెంచుకోవటం ద్వారా భారత్ మీద అధిపత్యం ప్రదర్శించాలన్న చావు తెలివితేటల్ని ప్రదర్శిస్తున్న చైనాకు డోక్లాం ఉదంతంలో భారత్ గట్టిగా ఉండటం డ్రాగన్కు ఒక పట్టాన మింగుడుపడనిదిగా మారింది. డోక్లామ్ ఇష్యూలో భారత్ కు సంబంధం లేదని.. అది కేవలం తమకు.. భూటాన్ కు మాత్రమే సంబంధమని భారత్ ను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తోంది చైనా. గడిచిన కొద్దికాలంగా డోక్లాం వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వేళ.. తాజాగా మరోసారి డ్రాగన్ విషాన్ని చిమ్మింది. డోక్లామ్ సరిహద్దుల నుంచి భారత దళాలు వెనక్కి వెళ్లాలని.. లేకుంటే కఠినమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న బెదిరింపులకు దిగింది. భారత దళాలు.. చైనా భూభాగంలోకి ప్రవేశించాయని.. వెంటనే వెనక్కి వెళ్లాలంటూ మాటలు మీరుతోంది. ఇందుకు సంబంధించి 15 పేజీల డాక్యుమెంట్ ను విడుదల చేసింది. అందులో పలు ఆరోపణలు చేసింది. జూన్ 18న 270 మంది భారత సైనికులు చైనా భూభాగంలోకి వంద మీటర్లు లోనికి వచ్చినట్లుగా పేర్కొంది. ఒక సందర్భంలో భారత సరిహద్దు బృందాలు ఒక బుల్డోజర్ చైనా భూభాగంలోకి వచ్చేశాయని.. 40 మంది భారత సరిహద్దు బృందాలు మూడు టెంట్లు వేసుకున్నట్లుగా పేర్కొంది. చైనా భూభాగంలోకి అక్రమంగా వస్తే సహించేది లేదన్న చైనా.. డోక్లాం నుంచి భారత్ దళాల్ని వెనక్కి పంపించి.. భూటాన్ లాంటి బుజ్జి దేశానికి చెందిన కీలక ప్రాంతం మీద పట్టు సాధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పాలి. ఇదే విషయాన్ని నేరుగా కాకున్నా.. డోక్లాం ఎపిసోడ్ లో భారత్ కు ఎలాంటి సంబంధం లేదని.. అదంతా చైనా-భూటాన్ సరిహద్దు వివాదంగా చెప్పుకొచ్చింది. ఈ విషయంలో భారత్ అస్సలు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని వెల్లడించింది. చైనా-భారత్- భూటాన్ సరిహద్దుల్లోని ట్రైజంక్షన్ నుంచి భారత దళాలు వెనక్కి వెళ్లాలంటూ గతంలోనూ డ్రాగన్ పేర్కొంది. అయితే.. చైనా హెచ్చరికల్ని భారత సైనిక బృందం ఏ మాత్రం ఖాతరు చేయటం లేదు. అంతేకాదు.. గతానికి భిన్నంగా చైనా వ్యాఖ్యలకు భారత్ ధీటు వ్యాఖ్యలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా చేసే బెదిరింపులకు లొంగేది లేదన్న కచ్ఛితమైన తీరును ప్రదర్శిస్తూ.. సరిహద్దుల నుంచి తమ దళాలు వెనక్కి తగ్గేదే లేదంటూ భారత్ స్పష్టం చేయటం గమనార్హం.

తెలంగాణాలో కేసీఆర్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న మహిళ ఎవరు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఓ మహిళ ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాపిస్తోంది. ఇంతకీ ఆ మహిళ కూడా తెలంగాణ ముద్దుబిడ్డే కావడం గమనార్హం. ఆ మహిళ ఎవరో తెలుసా..? ఓ న్యాయవాది. పేరు రచనా రెడ్డి. మెదక్ జిల్లా నాగిరెడ్డిపేట వాసి. నల్సర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంతకీ ఈమెను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు వణికిపోతున్నారో తెలుసుకుందాం? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెనువెంటనే కథనరంగంలోకి దిగారు. ఇందులోభాగంగా, తెలంగాణాను సస్యశ్యామలం చేయాలన్న కృతనిశ్చయంతో ఆయన భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించతలపెట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములను అడ్డగోలుగా సేకరించేందుకు నడుం బిగించారు. ఇందుకోసం జీవో 123ని జారీ చేశారు. ఇక్కడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పప్పులో కాలేసింది. ఈ జీవోకు వ్యతిరేకంగా న్యాయవాది రచనా రెడ్డి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా, ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. ఈ జీవోను కొట్టివేసింది. ఇది తెరాస సర్కారుతో పాటు.. కేసీఆర్‌కు తీవ్ర పరాభవంగా మారింది. దీంతో రచనారెడ్డిపై కేసీఆర్ విమర్శలదాడికి దిగారు. అయినా రచనా రెడ్డి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. భయపడలేదు. బెదరలేదు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తెరాస ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు భూసేకరణపై పోరాటం చేస్తూనే.. భూమిని కోల్పోతున్న భూనిర్వాసితులకు, ముంపు బాధితులకు అండగా నిలిచారు. దీంతో ప్రభుత్వం సాఫీగా భూసేకణ చేపట్టలేని పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో రచనా రెడ్డి పేరు ఇపుడు తెలంగాణ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆమె పేరెత్తితేనే సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొత్తం తెలంగాణ బిడ్డను అని చెప్పుకునే కేసీఆర్‌కు ఆ తెలంగాణ బిడ్డే ముప్ప తిప్పలు పెడుతోంది. కాగా, రచనా రెడ్డి పూణెలో విద్యాభ్యాసం చేసంది. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి.. అక్కడే ఉన్న ల్యూపెస్టర్ యూనివర్శిటీలో అంతర్జాతీయ మానవహక్కుల అంశంపై పీహెచ్‌డీ చేస్తోంది. అంతేకాకుండా, మానవహక్కుల కమిషన్‌లో ఉన్న 11 మంది న్యాయవాదుల బృందంలో ఆమె ఒక సభ్యురాలు. ఉమ్మడి హైకోర్టులో న్యాయవాది. మూడున్నరేళ్ళ పాటు అమెరికాలో మానవహక్కుల ఉల్లంఘనపై పోరాటం చేసిన రచనా రెడ్డి ఇపుడు తన సొంత జిల్లాకు వచ్చి అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా నడుంబిగించింది. భూనిర్వాసితులు. ముంపు బాధితులకు అండగా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది. అధికారం అడ్డుపెట్టుకుని అడ్డగోలు నిర్ణయాలతో ముందుకెళుతున్న కేసీఆర్‌ స్పీడుకు ఆమె బ్రేక్‌లు వేసింది.

నంద్యాలది ధర్మయుద్ధం.. ప్రజలది శ్రీకృష్ణ పాత్ర: వైఎస్‌ జగన్‌

పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘అబద్ధాలు చెబుతూ మోసపూరిత జీవోలు ఇస్తూ అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కారణం ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీలోకి అభ్యర్థిని దింపింది కాబట్టి. కుట్రలు, కుయుక్తులు ఎక్కువయ్యాయి. మనం పోటీలో ఉన్నాం కాబట్టే ఇవాళ చంద్రబాబు వారి కేబినెట్‌, ఆయన కొడుకు నడి రోడ్డుపై కనిపిస్తున్నారు. ఒక వేళ మనం (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ) నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని ఉంటే చంద్రబాబు నంద్యాలకు ఒక్క రూపాయి అయినా విదిల్చేవాడా? నంద్యాలకు ఒక్క పథకం ఇచ్చేవాడా? ఇంతమంది మంత్రులు నంద్యాల నడిరోడ్డుపై కనిపించేవారా? అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో? నంద్యాల ప్రజలకే కాదు.. ఈ జిల్లాలో ఉన్న పక్క నియోజకవర్గాల ప్రజలకు తెలుసు? ఎవరు అమ్ముడుపోయారో వారి నియోజవర్గ ప్రజలకు కూడా తెలుసు. ఉప ఎన్నికల్లో ఎప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ పోటీ పెడితే అప్పుడు చంద్రబాబు నిద్రలేస్తారు. నంద్యాలది ధర్మయుద్ధం నంద్యాలలో జరుగుతుంది ఉప ఎన్నిక కాదు.. ధర్మయుద్ధం. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మద్య యుద్ధం. ఇది విశ్వసనీయ రాజకీయాలకు వంచన రాజకీయాలకు మధ్య జరుగుతున్న యుద్ధం.. మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు చేసిన మోసాలు, కుట్రలు, అవినీతి, అసమర్థ పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. చంద్రబాబు దోచుకున్న మూడున్నర లక్షలకోట్లలో కొంత డబ్బు వెదజల్లి పోలీసులను నమ్ముకొని, అధికారాన్ని నమ్ముకొని అధికారం దుర్వినియోగంం చేస్తూ మనుషుల్ని కొనుగోలు చేస్తూ చంద్రబాబు చేస్తున్న దగా పాలన మీద చేస్తున్న యుద్ధం ఈ ఉపఎన్నికలు.
2019లో ప్రజలది శ్రీకృష్ణ పాత్ర 2019లో జరగబోయే కురుక్షేత్రం సంగ్రామానికి నాంది ఈ ఎన్నికలు. ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర. ప్రజలు ఆయుధం పట్టనక్కర్లేదు.. యుద్ధం చేయనక్కర్లేదు.. తమ చూపుడు వేలితో ఈవీఎం అనే విష్ణు చక్రం తిప్పుతూ చంద్రబాబు కౌరవ సామ్రాజ్యం కూకటి వేళ్లతో పెకలించాలి. ఏ మతాన్ని చూసుకున్నా.. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ చదివినా అవి చెప్పేది ఒకటే. ధర్మం న్యాయం గొప్పవని చెబుతాయి. ఖురాన్‌ తెలిపే మహ్మద్‌ ప్రవక్త గురించి మీకు ఓ కథ చెబుతున్నాను. ‘మహ్మద్‌ ప్రవక్తను హత్య చేసేందుకు కుట్ర దారులంతా కూడా ఒక చోట ఏకమవుతారు. సత్య సందేశాన్ని సహించలేని వీరంతా దారుల్‌ నాదువాలో సమావేశం అయ్యి హత్య గురించి చర్చిస్తారు. అక్కడ రెండు మూడు ప్రతిపాదనలు పెడతారు. చివరగా అబూ జహన్‌ అనే కుట్రదారుడు చేసిన ప్రతిపాదన అందరికీ నచ్చుతుంది.. అదేమిటంటే అన్ని తెగల నుంచి పలుకుబడి ఉన్న కుటుంబాల్లోని యువకులను ఎంపిక చేసి వారికి కత్తులు ఇచ్చి వారంతా కూడా మహ్మద్‌ ప్రవక్త మీద దాడి చేస్తే నేరం అందరిపై పడుతుంది. అలా జరిగితే అందరిపై పోరాడలేరు. పరిహారం ఇవ్వాలని మాత్రమే అడుగుతారు. అని చెప్పగా ఇది అందరికి నచ్చుతుంది. అనుకున్న ప్రకారం ఎంపిక చేసి మహ్మద్‌ ప్రవక్తను హత్య చేసేందుకు ప్రవక్త ఇంటిని చుట్టు ముడతారు. ఆ విషయం జబ్రీల్‌ అనే దైవదూత ద్వారా తెలుసుకొని చిరునవ్వు నవ్వుతూ ఇసుక తీసుకొని హత్య చేసేందుకు వచ్చినవారి తలలపై జల్లుతూ నవ్వుతూ వెళ్లిపోతారు. ఆ సమయంలో వారు ఏం చేయలేక తలలు వంచుతారు. దీనర్ధం ఏమిటంటే దొంగదెబ్బతీసేవారు.. వెన్నుపోటు పొడిచేవారు ధర్మం ముందు తల వంచాల్సిందే. ఇదే విషయాన్ని ఖురాన్‌ చెబుతోంది..
ఇది దొంగల పాలనా.. ప్రజల పాలనా? అభాండాలతో తాత్కాలిక విజయం రావొచ్చు.. కానీ, సత్యవంతులదే విజయం అని ఖురాన్‌ చెబుతుంది. అన్ని మతాలు కూడా ఇదే చెబుతాయి. ఏ మతమైనా తప్పును తప్పంటుంది.. దొంగను దొంగేనని, మోసాన్ని మోసమేనని చెబుతుంది. సీతమ్మను దొంగతనంగా ఎత్తుకుపోయిన రావణుడిని రాక్షసుడు అంటాం.. మన పొలంపంటను, మన ఆస్తిని ఎత్తుకుపోయినవారిని దొంగ అంటాం. మన పిల్లల్ని ఎత్తుకొని పోయేవాడిని బూచోడని అంటాం. మరీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లిన వారిని ఏమనాలి? వారిని ఎత్తుకుపోయిన చంద్రబాబునాయుడిని ఏమనాలి? దొంగ అంటామా సీఎం అంటామా.. ఇది దొంగల పాలన అంటామా ప్రజల పాలన అంటామా? సొంతమామనే వెన్నుపోటు పొడిచి ఆయన కష్టం ఆయన పదవి, ఆయన పార్టీ గుర్తును లాగేసుకున్న వ్యక్తిని ఏమంటారు? మిగతా పార్టీల్లో చిచ్చుపెట్టే వ్యక్తిని ఏమంటాం? ప్రజలను వెన్నుపోటు పొడిచే వ్యక్తిని ఏమంటాం? అప్పట్లో చంద్రబాబును ఉదహరిస్తూ నాన్నగారు వైఎస్‌ఆర్‌ ఓ కథ చెప్పేవారు. అనగనగా ఓ ముద్దాయి ఉండేవాడు. అతడు కోర్టుబోనులో ఉన్నాడు. జడ్జి రాగానే బోరున ఏడ్వడం మొదలపెట్టాడు. తల్లిదండ్రి లేని ఆనాధను వదిలేయండి అన్నాడు.. మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. జడ్జికి బాధ కలిగి లాయర్లను అతడు చేసిన నేరం ఏమిటని అడగ్గా.. పబ్లిక్‌ప్రాసీక్యూటర్‌ ఏమన్నారో తెలుసా.. తల్లిదండ్రిని చంపిన వ్యక్తి అని చెప్తాడు. ఇది చంద్రబాబు నైజం. చంద్రబాబే తన మామ ఎన్టీఆర్‌ను చంపి ఆయనే ఫొటోలు తెచ్చి ఎన్నికలకు వెళతాడు. మొన్నటి వరకు మైనార్టీలను దెబ్బ కొట్టాడు. ఎన్నికలు రాగానే మళ్లీ అదే మైనార్టీలపై లేని ప్రేమను చూపిస్తున్నాడు. రైతులను, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు. ఎన్నికలొస్తే పవన్‌ కల్యాణ్‌ను పిలిపించుకుంటారు తన పాలనపై నమ్మకం లేని చంద్రబాబు నంద్యాల ఎన్నికలు వచ్చేసరికి పవన్ కల్యాణ్ ను పిలిపించుకుంటున్నారు. చిన్న పిల్లలను సైతం వదలకుండా వెన్నుపోటు పొడిచే రకం చంద్రబాబు. మూడేళ్ల నుంచి టీడీపీ ప్రభుత్వం చేయని అవినీతి లేదు. ఇసుక నుంచి మొదలుకుంటే అన్ని పనుల్లోనూ అవినీతిమయమే. ఎన్నికల ప్రచారంలో మాత్రం నా అంత నిప్పు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేరని చెబుతారు. అరవై ఏళ్లకు రిటైర్మెంట్ వయసు పెంచుతున్నట్లుగా నటించి, 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపేలా జీవోలు విడుదల చేస్తారు. ఇప్పుడు మాత్రం అబ్బే అది నిజం కాదంటూ దాటవేస్తారు. తల్లిదండ్రిని చంపేసి తాను అనాథను అని చెప్పి శిక్షించవద్దంటూ జడ్జి ముందు ఏడ్చే తరహా వ్యక్తి చంద్రబాబు. ఇటువంటి వ్యక్తిని నడిరోడ్డుమీద కాల్చిన తప్పులేదు. నంద్యాల ప్రజలు జడ్జి స్థానంలో ఉన్నారు కనుక ఆయనకు ఏం శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించుకోవాలి. కన్నతల్లికి పట్టెడు అన్నం పెట్టని వ్యక్తి పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని ప్రగల్బాలు పలుకుతాడు. సొంత జిల్లా చిత్తూరుకే ఎలాంటి పని చేయని వ్యక్తి.. ఇతర జిల్లాకు ఏదేదో చేసేస్తానని హామీలివ్వడం అలాగే కనిపిస్తుంది. ప్రశ్నిస్తే కేసులు పెడతారు సీఎం హోదాలో కర్నూలులో ఇచ్చిన హామీలకే దిక్కులేని పక్షంలో నేడు నంద్యాల ఉప ఎన్నికల్లో మీరిచ్చే హామీలకు గ్యారంటీ లేదని ప్రజలు ఎప్పుడో గుర్తించారు. కర్నూలు స్మార్ట్ సిటీ, ఆధోనిలో టెక్స్ టైల్ పార్కులు, ట్రిపుల్ ఐటీ, న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్, స్విమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మైనింగ్ స్కూలు, ఫుడ్ పార్క్ సహా ఎన్నో హామీలిచ్చారే తప్ప ఇందులో ఏ ఒక్కటైనా నెరవేర్చారా. మాట మీద నిలబడాలని అడిగితే కేసుల మీద కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తారు. కాపులు రిజర్వేషన్లు అడుగుతూ కంచాలు మోగించినా కేసులు పెడతారు. కానీ ఆయన లంచాలు మింగినా కేసులు ఉండవు. ఎన్నికలుంటేనే ముస్లింలు గుర్తొస్తారు ఎన్నికలుంటేనే ముస్లింలు గుర్తుకొస్తారు. ఆయన కేబినెట్ లో ఒక్క ముస్లిం మైనార్టీ వ్యక్తికి చోటివ్వని సీఎం చంద్రబాబు. 2014 లో ముస్లింలకు కేవలం ఒకే ఒక్క సీటు ఇచ్చారు. గెలవరని తెలిసిన ప్రాంతంలో సీటిచ్చి ఓ నేతను బలి పశువును చేశారు. మైనార్టీ నేత అబ్దుల్ గని సేవలందించిన హిందూపురం సీటును తన బావమరిది బాలకృష్ణకు అప్పగించారు. ఆ తర్వాత అబ్దుల్ గనికి తనను కలిసేందుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నది నిజం కాదా? తన కొడుకును ఎమ్మెల్సీగా గెలిపించుకొని కేవలం మూడు రోజుల్లోనే మంత్రివర్గంలో చోటిస్తారు, కానీ ఏ ఒక్క ముస్లింకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం ముస్లింలపై చంద్రబాబుకున్న విలువలేంటో కనిపిస్తోంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి వైఎస్ఆర్. ఫీజులు కట్టలేని పేదలకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన వ్యక్తి వైఎస్ఆర్. తమ ఎమ్మెల్యే కూడా పైకి పోతే బాగుండునని సాక్షాత్తూ భూమా నాగిరెడ్డి బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి నంద్యాలలోనే చెప్పారంటే.. రాష్ట్రంలో టీడీపీ పాలన ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం కేవలం 35వేల ఇళ్లు కట్టించగా.. ఉప ఎన్నికల నేపథ్యంలో కేవలం నంద్యాలలోనే 13 వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పడం వెనుక స్కామ్ ఉంది. బినామీ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి అడుగుకు వెయ్యి రూపాయలకు బదులుగా రూ. 2000 అందిస్తూ లబ్ధిదారుల నడ్డి విరచడమే స్కామ్ ఉద్దేశం. ఆపై 20 ఏళ్లపాటు ఆ లబ్ధిదారులు నెలకు రూ.3000 చెల్లిస్తూనే ఉండేలా పథకం రచించిన వ్యక్తి చంద్రబాబు. ‘అది నీ అత్తగారి సొత్తు కాదు’ నంద్యాలలో పెన్షన్ల విషయంలో కూడా చంద్రబాబు చాలా దారుణంగా చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ పాలనలో దాదాపు 28వేల పెన్షన్లు ఉంటే చంద్రబాబు పాలనలో పది వేలయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు రాగానే 22 వేలకు పెరిగాయి. ముందు రోజుల్లో తిరిగి ఎన్ని తగ్గుతాయో తెలియదు. నంద్యాల ప్రజలకు కేశవరెడ్డి రూ.850 కోట్ల పెద్ద టోపీ పెట్టారు. తమ డిపాజిట్లను ప్రజలు తిరిగి అడిగితే పట్టించుకోని చంద్రబాబు.. కేశవరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణరెడ్డిని మాత్రం తన బినామీగా చేసుకొని కేబినెట్‌లో పెట్టుకున్నారు. సీఐడీతో కేసు పెట్టించి 280 కోట్ల డిపాజిట్‌లు మాత్రమే చూపించారు. కేశవరెడ్డి స్కూళ్లను నారాయణ, చైతన్యకు అప్పగిస్తారు. చంద్రబాబు వచ్చినప్పుడు మూడేళ్లలో ఏం చేశారని గట్టిగా అడగండి. ప్రజలు దాడి చేస్తారని చంద్రబాబుకు ముందే తెలుసు.. అందుకే ప్రజలపై పిచ్చికోపం చూపిస్తారు. ‘నాపెన్షన్లు తింటున్నారు.. నారేషన్‌ తింటున్నారు. నా రోడ్డపై తిరుగుతున్నారు. నాకు ఓటు వేయకుంటే ఎలా.. మీ గ్రామాలను పక్కన పెడతాం అని బెదిరిస్తున్నారు’ అని అంటున్నారు. చంద్రబాబు మీరు తప్పు చేస్తున్నారు. నువ్వు వేశావని చెబుతున్న అదే రోడ్లపై నిలబడి ప్రశ్నిస్తాం. వీధి దీపాల కింద కూర్చుని నిలదీస్తాం. నువ్వు ఏదైనా ప్రజలకు ఇస్తే అది నీ అత్తగారి సొత్తుకాదు. నంద్యాల ఓ జిల్లా.. ఏపీని 25 జిల్లాలు చేస్తాం ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తాయి. మీ అందరి ఆశీస్సులతో నంద్యాలలో వేసే ఓటే తొలి ఓటు. రేపు జరగబోయే మార్పునకు నంద్యాల నాంది పలుకుతోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక నంద్యాలను నాకు వదిలేయండి. విత్తనానికి, వ్యవసాయానికి కేంద్రం చేస్తాం. నంద్యాలలో వ్యవసాయ వర్సిటీ తెస్తాం. నంద్యాలలో కుందూ నది వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతుందో చూశా.. చంద్రబాబు చేయిస్తున్న నాలుగు ప్రొక్లయిన్లతో ఆ పనికాదు.. ఆ కష్టం నాకు వదిలేయండి. నంద్యాలను మోడల్‌ టౌన్‌ చేస్తా. ఇప్పటికే పార్టీ ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించాం. అవి రేపు పొద్దున రాష్ట్ర చరిత్రను మారుస్తాయి. కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి నవరత్నాలను అందిస్తాం. అవి అందరికీ అందాలంటే ఈ వ్యవస్థలో మార్పురావాలి. నంద్యాలను జిల్లా చేస్తాం. నంద్యాల జిల్లాకు నంద్యాలలోనే హెడ్‌ క్వార్టర్‌. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాను చేస్తాం. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తాం. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది. నంద్యాల అభివృద్ధి బాధ్యత నాకు వదిలేయండి. ఇళ్లు లేనివారికి ఒక మాట చెబుతున్నాను. ఇళ్లు మేమే కట్టిచ్చి పట్టాలు కూడా చేతికి అందిస్తాం. పరిహారం చెల్లించకుండా అన్యాయానికి గురైన వారికి న్యాయం చేస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ సోదరులకు చెబుతున్నా.. మీరు ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. మన ప్రభుత్వమే వస్తుంది. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ స్థాపిస్తాం. ప్రతి మైనార్టీ వ్యక్తికి చెబుతున్నాను. 2018లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎమ్మెల్సీ సీటును మైనార్టీకే ఇస్తాం. చంద్రబాబు చొక్కా, ఆదినారాయణ రెడ్డి నిక్కర్‌ ఊడుద్ది కేశవ్‌ రెడ్డి బాధితులకు, అగ్రి గోల్డ్‌ బాధితులకు ఇవ్వాల్సిన డబ్బు మూడు నెలల్లో ఇచ్చేస్తాం. చంద్రబాబు చొక్కా వదిలిస్తాం.. ఆది నారాయణరెడ్డి నిక్కర్‌ ఊడదీస్తాం. కేసులన్నీ తిరగతోడతాం. వారి నుంచి రావాల్సిన డబ్బు ఎలా వసూలు చేయాలో ప్రభుత్వం చూసుకుంటుంది. నంద్యాలలో మీరిచ్చే ఆశీస్సులు రేపటి విజయానికి పునాదులు కావాలి. ఇక్కడికి వచ్చాకే తెలిసింది. కుతంత్రాలతో చంద్రబాబు మనుషులు ఇంటింటి వెళ్లి చెబుతున్నారట.. జగన్‌ ఇప్పుడే సీఎం కాదు కదా అని. నేను మీకు ఒకటే చెబుతున్నాను. ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న సంగ్రామం. ఈ ఎన్నికలతో జగన్‌ సీఎం ఇప్పుడే కాకపోవచ్చేమో.. కానీ 2019 కురుక్షేత్రం నంద్యాల నాంది అవుతుంది. సింహంలా రాజీనామా చేశారు శిల్పా చక్రపాణి రెడ్డి నా దగ్గరకొచ్చినప్పుడు చంద్రబాబు మాదిరిగా రాజకీయాలు చేయలేనని చెప్పి.. న్యాయం, ధర్మబద్ధంగా ఉండి రాజీనామా చేసే రావాలని చెప్పాను.. తొలుత కొంత ఇబ్బంది పడినా తర్వాత ఆయన స్పీకర్‌ ఫార్మాట్‌లో కౌన్సిల్‌ చైర్మన్‌కు రాజీనామా లేఖ రాసిచ్చారు. ఒక సింహంలాగా ఆయన ఈ పనిచేశారు. ఇలాంటి రాజీనామాలు ఆహ్వానించాలి. కానీ చంద్రబాబు పరిస్థితి ఏమిటంటే ఎవరికైనా రేటెంతా అని ఆయన అడుగుతారు. ఆ కలియుగ రాక్షసుడిని(చంద్రబాబును) హతమార్చేందుకు మీరంతా సవ్యసాచులు కావాలి. ఈ చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. శిల్పా మోహన్‌రెడ్డిని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలి’

జగన్ పేల్చిన తూటాలు ఇవే!

ఉప ఎన్నికలు ఎప్పుడు.. ఎక్కడ వచ్చినా అధికారపక్షానికి సానుకూలంగా ఉండటం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. మళ్లీ.. అలాంటి ప్రత్యేక పరిస్థితులు తాజాగా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.సార్వత్రిక ఎన్నికల వేళలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి.. కాలక్రమంలో అవకాశవాద రాజకీయాల కోసం పార్టీని విడిచి పెట్టి ఏపీ అధికారపక్షం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం గుండెపోటుగా ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగితే.. ఏపీ అధికారపక్ష తరఫున భూమా అవినాశ్ రెడ్డి బరిలోకి దిగారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు నంద్యాల నియోజకవర్గ ప్రజలు భారీగా హాజరయ్యారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు రాక్షస పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన జగన్ ఏమన్నారు? ఏయే అంశాల్ని ప్రస్తావించారు? అన్న విషయాల్ని ఆయన మాటల్లోనే చెబితే.. = నంద్యాలలో జరుగుతుంది ఉప ఎన్నిక కాదు.. ధర్మయుద్ధం. ధర్మానికి అధర్మానికి - న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధం. ఇది విశ్వాస రాజకీయాలకు వంచన రాజకీయాలకు మధ్య జరుగుతున్న యుద్ధం.. మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలపైనా.. కుట్రలు.. అవినీతి పైనా.. అసమర్థ పాలనపైనా ప్రజలు ఇచ్చే తీర్పుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. = చంద్రబాబు దోచుకున్న మూడున్నర లక్షలకోట్లలో కొంత డబ్బు వెదజల్లి పోలీసులను నమ్ముకొని అధికారాన్ని నమ్ముకొని అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. మనుషుల్ని కొనుగోలు చేస్తూ.. చంద్రబాబు చేస్తున్న పాలన మీద చేస్తున్న యుద్ధం ఈ ఉపఎన్నికలు. 2019లో జరగబోయే కురుక్షేత్రం సంగ్రామానికి నాంది ఈ ఎన్నికలు. ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర. ప్రజలు ఆయుధం పట్టనక్కర్లేదు.. యుద్ధం చేయనక్కర్లేదు.. తమ చూపుడు వేలితో ఈవీఎం అనే విష్ణు చక్రం తిప్పుతూ చంద్రబాబు కౌరవ సామ్రాజ్యం కూకటి వేళ్లతో పెకలించాలి. = ఏ మతాన్ని చూసుకున్నా.. భగవద్గీత - బైబిల్ - ఖురాన్ చదివినా అవి చెప్పేది ఒకటే. ధర్మం న్యాయం గొప్పవని చెబుతాయి. ఖురాన్ తెలిపే మహ్మద్ ప్రవక్త గురించి మీకు ఓ కథ చెబుతున్నాను. ‘మహ్మద్ ప్రవక్తను హత్య చేసేందుకు కుట్ర దారులంతా ఒక చోట ఏకమవుతారు. సత్య సందేశాన్ని సహించలేని వీరంతా దారుల్ నాదువాలో సమావేశం అయ్యి హత్య గురించి చర్చిస్తారు. అక్కడ రెండు మూడు ప్రతిపాదనలు పెడతారు. చివరగా అబూ జహన్ అనే కుట్రదారుడు చేసిన ప్రతిపాదన అందరికీ నచ్చుతుంది.. అదేమిటంటే అన్ని తెగల నుంచి పలుకుబడి ఉన్న కుటుంబాల్లోని యువకులను ఎంపిక చేసి వారికి కత్తులు ఇచ్చి వారంతా కూడా మహ్మద్ ప్రవక్త మీద దాడి చేస్తే నేరం అందరిపై పడుతుంది. అలా జరిగితే అందరిపై పోరాడలేరు. పరిహారం ఇవ్వాలని మాత్రమే అడుగుతారని చెప్పగా ఇది అందరికి నచ్చుతుంది. దీంతో అలాగే యువకులను ఎంపిక చేసి మహ్మద్ ప్రవక్తను హత్య చేసేందుకు ప్రవక్త ఇంటిని చుట్టు ముడతారు. ఆ విషయం జబ్రీల్ అనే దైవదూత ద్వారా తెలుసుకొని చిరునవ్వు నవ్వుతూ ఇసుక తీసుకొని హత్య చేసేందుకు వచ్చినవారి తలలపై జల్లుతూ నవ్వుతూ వెళ్లిపోతారు. ఆ సమయంలో వారు ఏం చేయలేక తలలు వంచుతారు. దీనర్ధం ఏమిటంటే దొంగదెబ్బతీసేవారు.. వెన్నుపోటు పొడిచేవారు ధర్మం ముందు తల వంచాల్సిందే. ఇదే విషయాన్ని ఖురాన్ చెబుతోంది. = అబద్ధాలతో తాత్కాలిక విజయం రావొచ్చు.. కానీ సత్యవంతులదే విజయం అని ఖురాన్ అని చెబుతుంది. అన్ని మతాలు కూడా ఇదే చెబుతాయి. ఏ మతమైనా తప్పును తప్పంటుంది.. దొంగను దొంగేనని మోసాన్ని మోసమేనని చెబుతుంది. = సీతమ్మను దొంగతనంగా ఎత్తుకుపోయిన రావణుడిని రాక్షసుడు అంటాం.. మన పొలం పంటను మన ఆస్తిని ఎత్తుకుపోయినవారిని దొంగ అంటాం. మన పిల్లల్ని ఎత్తుకొని పోయేవాడిని బూచాడని అంటాం. మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లిన వారిని ఏమనాలి? వారిని ఎత్తుకుపోయిన చంద్రబాబునాయుడిని ఏమనాలి? దొంగ అంటామా? సీఎం అని అంటామా..? ఇది దొంగల పాలన అంటామా? ప్రజల పాలన అంటామా? సొంతమామనే వెన్నుపోటు పొడిచి ఆయన కష్టంతో వచ్చిన ఆయన పదవిని ఆయన పార్టీ గుర్తును లాగేసుకున్న వ్యక్తిని ఏమంటాం? = మిగితా పార్టీల్లో చిచ్చుపెట్టే వ్యక్తిని ఏమంటాం? ప్రజలను వెన్నుపోటు పొడిచే వ్యక్తిని ఏమంటాం? అప్పట్లో చంద్రబాబును ఉదహరిస్తూ నాన్నగారు వైఎస్ఆర్ ఓ కథ చెప్పేవారు. అనగనగా ఓ ముద్దాయి ఉండేవాడు. అతడు కోర్టు బోనులో ఉన్నాడు. జడ్జి రాగానే బోరున ఏడ్వడం మొదులపెట్టాడు. తల్లితండ్రి లేని ఆనాధను వదిలేయండి అన్నాడు.. మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. జడ్జికి బాధ కలిగి లాయర్లను అతడు చేసిన నేరం ఏమిటని అడగ్గా.. పబ్లిక్ప్రాసీక్యూటర్ ఏమన్నారో తెలుసా.. తల్లితండ్రిని చంపిన వ్యక్తి అని చెప్తాడు. ఇది చంద్రబాబు నైజం. చంద్రబాబే తన మామ ఎన్టీఆర్ ను చంపి ఆయనే ఫొటోలు తెచ్చి ఎన్నికలకు వెళతాడు. మొన్నటి వరకు మైనార్టీలను దెబ్బ కొట్టాడు. ఎన్నికలు రాగానే మళ్లీ అదే మైనార్టీలపై లేని ప్రేమను చూపిస్తున్నాడు. రైతులను - డ్వాక్రా అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు. = ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల సంఖ్యను పెంచుతామని హామీ ఇస్తున్నా. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. కానీ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చుతాం. మొత్తం 25 జిల్లాలుగా మారుస్తాం. నంద్యాల పట్టణాన్ని కలెక్టరేట్..ఎస్సీ కార్యాలయాలతో జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 2018లో వచ్చే ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానానికి నంద్యాల నుంచే ముస్లిం మైనారీటికి అవకాశం ఇస్తాం.

జగన్ చేతిలో రాజీనామా లేఖ పెట్టి..బాబుకు షాక్ ....

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాకిస్తూ.. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి జగన్ పార్టీలో చేరనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు తగ్గట్లే తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు శిల్పా చక్రపాణి రెడ్డి. అయితే.. టీడీపీలో ఉన్నప్పుడు తనకొచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటమే కాదు.. ఆ లేఖను వేలాది ప్రజానీకం ఎదుట పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవిని చేపట్టి తాను తొంభై రోజులు కూడా కాలేదన్న ఆయన.. దమ్ముంటే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా తన మాదిరే పదవికి రాజీనామా చేయగలరా? అంటూ సవాలు విసిరారు. బాబు చెప్పిన పని చేయరని.. కానీ.. జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్నారు. ఈ రోజు ఆట మొదలైందని.. ఇక ఏ ఆటకైనా రెఢీ అన్నారు. తనకు అత్యాశ అని చంద్రబాబుకు కుమారుడు.. మంత్రి లోకేశ్ అన్నారని.. అసలు తనకు ఆశే లేదని.. ఇంక అత్యాశ ఎక్కడదని ప్రశ్నించారు. ఎలాంటి త్యాగాలకైనా శిల్పా సోదరులం సిద్ధమన్న చక్రపాణి రెడ్డి.. ప్రజల కోసం ఏమైనా చేస్తామన్నారు. భూమా ఫ్యామిలీ డ్రామా మొదలైందని.. ప్రజలు మాత్రం ఆ డ్రామాల్ని తెలుసుకోవాలన్నారు. తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదన్న ఆయన.. పార్టీని విడిచి రాజీనామా చేయని ఏ ఎమ్మెల్యేను కానీ.. ఎంపీని కానీ నంద్యాలలో అడుగుపెట్టనీయొద్దని పిలుపునిచ్చారు. చక్రపాణి రెడ్డి ఆవేశ పూరిత ప్రసంగానికి నంద్యాల సభకు హాజరైన ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం గమనార్హం.

02 August 2017

మాజీ మంత్రికి పొగబెడుతున్న తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీ వైఖరితో ఇన్నాళ్లు రాష్ట్రస్థాయి నాయకుల్లో నెలకొన్న అంతర్గత కల్లోలాలు ఇప్పుడు స్థానిక నేతల స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ చీలికతో మంత్రి - ఎంపీ స్థాయి నాయకులు తమదైన శైలిలో వ్యూహాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత లక్ష్యంగా ఎంపీ మాగంటి బాబు వ్యూహం పన్నుతున్నారని తెలుస్తోంది. చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో ఎంపీ - మాజీ మంత్రి వర్గీయుల పంచాయతీ తారాస్థాయికి చేరినట్లు సమాచారం.
తన వర్గం మనుషులకే మార్కెట్ కమిటీ పదవి ఇప్పించుకునేందుకు మాజీ మంత్రి ప్రయత్నిస్తుండటంతో మండిపడ్డ స్థానిక టీడీపీ నేతలు ఎంపీని ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఆయన తెరవెనుకగా మంత్రికి వ్యతిరేకంగా పావులు కదిపినప్పటికీ తాజాగా నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా జంగారెడ్డి గూడెం తాజాగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి వర్గం మంగళవారం మరోసారి సమావేశమైంది. ఎమ్మెల్యే పీతల సుజాత లక్ష్యంగా ఈ సమావేశంలో నేతల ప్రసంగాలు సాగాయి. జంగారెడ్డిగూడెం మండల పట్టణ కమిటీల నియామకం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న దేశం నేతలు త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. టౌన్ హాల్ లో జరిగిన తొలి సమావేశానికి వచ్చినంత మంది నేతలు ఈ సమావేశానికి రాకపోయినప్పటికీ పార్టీ సీనియర్ - జిల్లా ఉపాధ్యక్షుడు మండవ లక్ష్మణరావు నాయకత్వాన్ని బలపరుస్తూ పట్టణంలోను రూరల్ మండలంలో ముఖ్యమైన 25 మంది నేతలు హాజరయ్యారు. జడ్పీటిసి శీలం రామచంద్రరావు కూడా సమావేశానికి హాజరుకావడం గమనార్హం. పట్టణ మండల కమిటీలను ఐవిఆర్ఎస్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్ళిన నేతలు ఎమ్మెల్యే సుజాత మంత్రికి ఇచ్చిన హామీ మేరకు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరించకపోవడంతో ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు దేశం నేతలు పెనుమర్తి రామ్ కుమార్ - అబ్బిన దత్తాత్రేయ - మద్దిపాటి నాగేశ్వరరావు - చిట్రోజు తాతాజి - పెసరగంటి జయరాజు - మందపల్లి లక్ష్మయ్య - గుమ్మడి వెంకటేశ్వరరావు - ముళ్ళపూడి శ్రీనివాసరావు - చాట్రాతి సత్యనారాయణ - పులపాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి మాజీ మంత్రి ఒంటెద్దు పోకడలను చర్చించనున్నట్లు అసంతృప్త నేతలు చెప్తున్నారు.

బాబుకు దిమ్మ తిరిగిపోయేలా మరో షాక్...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో బాబు తీసుకున్న నిర్ణయానికి ఆయన భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూమా వర్గానికి.. శిల్పా వర్గానికి నడుస్తున్న రాజకీయ వైరంలో బాబు భూమా వర్గానికి తలొగ్గటం.. శిల్పాను పక్కన పెట్టటం తెలిసిందే. దీంతో.. చిన్నబుచ్చుకున్న శిల్పా జగన్ పార్టీలో చేరుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నంద్యాల అసెంబ్లీలో మాంచి పట్టు ఉన్న శిల్పా మోహన్ రెడ్డి పార్టీ నుంచి వీడిపోవటమే కాదు.. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రత్యర్థిగా మారటం ఇబ్బందికరంగా మారింది. దీంతో.. నంద్యాల స్థానాన్ని చేజిక్కించుకోవటం కోసం ఆయన కిందామీదా పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున హామీలు ఇవ్వటం.. ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటం విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు మరో భారీ షాక్ తగిలింది. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు.. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి అన్నబాటలో పయనించాలని నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు.. అనుచరుల సలహా మేరకు ఆయన ఏపీ అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రేపు (గురువారం) నంద్యాలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ఏపీ విపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీ చేరనున్న నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ కోసం ఎంతగానో పని చేస్తున్నా.. పట్టించుకోకుండా నిన్నా మొన్న వచ్చిన వారికి పెద్దపీట వేయటం పట్ల శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు.. అనుచరులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీలో ఉన్నంత కాలం అవమానాలు తప్పేటట్లు లేవని.. అందుకే గౌరవంగా ఉండే చోట ఉందామంటూ మండిపడిన వారు.. పార్టీ మారాలన్న నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. దీంతో.. జగన్ పార్టీలోకి చేరేందుకు శిల్పా చక్రపాణిరెడ్డి సిద్ధమయ్యారని చెప్పాలి.

ఫిరాయింపులపై జగన్ మార్కు అస్త్రం ఇదే!

తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే కాకుండా... రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. ఒక పార్టీ టికెట్ పై ప్రజా ప్రతినిధిగా గెలిచి ఆ తర్వాత ఇంకో పార్టీ తాయిలాలకు లొంగిపోయి ఆ పార్టీ మారుతున్న నేతలు చాలా మందినే మనం చూశాం. అయితే ఈ తరహా పార్టీ ఫిరాయింపులపై చట్టంలో చాలా నిబంధనలే ఉన్నాయి. ఏ పార్టీ టికెట్ పై అయితే ప్రజాప్రతినిధిగా విజయం సాధించారో ఆ పార్టీని వీడాలంటే... ఆ పార్టీ టికెట్ ద్వారా దక్కిన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అలా కాకుండా ఒక పార్టీ నుంచి దక్కిన పదవిని ఇంకో పార్టీలో కూడా చేరి అనుభవిస్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు. అలాంటి కుటిల రాజకీయాలకు చెక్ చెప్పేందుకు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం పదవి ఇచ్చిన పార్టీని వీడకుండానే ఇంకో పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధిపై అనర్హత వేటు వేయాలి. పార్టీ ఫిరాయించిన వారు రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులైతే... ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ - ఎమ్మెల్సీల విషయంలో మండలి చైర్మన్ ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు అటు తెలంగాణలోనే కాకుండా ఇటు ఏపీలోనూ భారీ ఎత్తున విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేయకుండానే అధికార పార్టీల్లో చేరిపోయారు. ఇలా పార్టీలు ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సదరు నేతలకు టికెట్లిచ్చి గెలిపించిన పార్టీలు ఫిర్యాదు చేసినా స్పందన లభించని వైనం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు తాను ఎంతో దూరంగా ఉంటానంటూ ఏపీలో విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తనకు దక్కిన ఎంపీ పదవితో పాటు తన తల్లి విజయమ్మకు దక్కిన ఎమ్మెల్యే పదవిని త్రుణప్రాయంగా వదిలేసుకున్నారు. తిరిగి తన సొంత పార్టీ టికెట్లపై ఉప ఎన్నికల్లో నిలిచి బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించారు. అంతేనా... నాడు ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి వచ్చిన ప్రజా ప్రతినిధులతో రాజీనామాలు చేయించిన జగన్... ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలకు స్వచ్ఛందంగా ముందుకెళ్లారు. విజయఢంకా మోగించారు. ఒకటి అరా స్థానాల్లో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆయన ఏమాత్రం అధైర్య పడలేదు. ఫిరాయింపులపై తనను వేలెత్తి చూపే అవకాశం రాకుండా జగన్ వ్వవహరిస్తున్న తీరు నిజంగానే ఆదర్శంగా ఉందనే చెప్పాలి. నాడు సానుభూతి పవనాలు వీచి జగన్ గెలిచారన్న వైరి వర్గాల ఆరోపణలను ఏమాత్రం లెక్కచేయని జగన్... నాటి నుంచి కూడా ఫిరాయింపులపై అదే వైఖరితో ముందుకు సాగుతున్నానని చెప్పేందుకు మరో తాజా నిదర్శనం వెలుగులోకి వచ్చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని జగన్ ఖరారు చేశారు. తాజాగా శిల్పా సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమైపోయారు. మొన్నటిదాకా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన చక్రపాణిరెడ్డి... మోహన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆది నుంచి ఎక్కడ ఉన్నా అన్నాతమ్ముళ్లిద్దరూ ఒకే వైపు ఉంటూ వచ్చిన శిల్పా సోదరులు... ఈ నాలుగైదు నెలలు మాత్రమే వేర్వేరు వర్గాల్లో ఉండిపోయారు. అయితే ఇక అలా ఉండటం కుదరదని భావించిన వారిద్దరూ కలిసే ముందుకు సాగాలని టీడీపీలో జరిగిన అవమానాలు ఇక చాలని వైసీపీలోనే ఉండిపోదామని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శిల్పా సోదరులు చక్రపాణి చేరికపై జగన్ తో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ నుంచి వారికి ఓ స్పష్టమైన సందేశం అందినట్లు సమాచారం. ఆ సందేశానికి సరేనన్న శిల్పా బ్రదర్స్... వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జగన్ ఆదేశానుసారం అటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి... టీడీపీ నుంచి తనకు దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఈ సింగిల్ స్టెప్ తో జగన్... ఎన్నికలు - నీతివంతమైన రాజకీయాల్లో తనకు ఎంతగా గౌరవముందో ఇట్టే చెప్పేసినట్టైంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు నంద్యాలకు ఉప ఎన్నిక రావడానికి కారణం దివంగత నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణమే. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా గుండెపోటు కారణంగా చనిపోయారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించిన భూమా... ఆ తర్వాత అధికార పార్టీ తాయిలాలకు లొంగిపోయి టీడీపీలో చేరిపోయారు. నాడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురు - ఇప్పటి మంత్రి భూమా అఖిలప్రియను కూడా ఆయన తన వెంట టీడీపీలోకి తీసుకెళ్లారు. నాడు వీరిద్దరితో పాటు టీడీపీలో చేరిన తమ ఎమ్మెల్యేలు 20 మందికి కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... స్పీకర్ కార్యాలయం నుంచి స్పందన వచ్చిన దాఖలానే కనిపించలేదు. ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలకు మీరెలా రెడ్ కార్పెట్ పరుస్తారంటూ దూసుకువచ్చే ప్రశ్నలకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మౌనమే సమాధానంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో జగన్ ధైర్యం ముందు చంద్రబాబు తేలిపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా హోరాహోరీగా ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నికకు ముందు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీకి నిజంగానే భారీగానే దెబ్బ పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.