03 August 2017

జగన్ చేతిలో రాజీనామా లేఖ పెట్టి..బాబుకు షాక్ ....

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాకిస్తూ.. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి జగన్ పార్టీలో చేరనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు తగ్గట్లే తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు శిల్పా చక్రపాణి రెడ్డి. అయితే.. టీడీపీలో ఉన్నప్పుడు తనకొచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటమే కాదు.. ఆ లేఖను వేలాది ప్రజానీకం ఎదుట పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవిని చేపట్టి తాను తొంభై రోజులు కూడా కాలేదన్న ఆయన.. దమ్ముంటే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా తన మాదిరే పదవికి రాజీనామా చేయగలరా? అంటూ సవాలు విసిరారు. బాబు చెప్పిన పని చేయరని.. కానీ.. జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్నారు. ఈ రోజు ఆట మొదలైందని.. ఇక ఏ ఆటకైనా రెఢీ అన్నారు. తనకు అత్యాశ అని చంద్రబాబుకు కుమారుడు.. మంత్రి లోకేశ్ అన్నారని.. అసలు తనకు ఆశే లేదని.. ఇంక అత్యాశ ఎక్కడదని ప్రశ్నించారు. ఎలాంటి త్యాగాలకైనా శిల్పా సోదరులం సిద్ధమన్న చక్రపాణి రెడ్డి.. ప్రజల కోసం ఏమైనా చేస్తామన్నారు. భూమా ఫ్యామిలీ డ్రామా మొదలైందని.. ప్రజలు మాత్రం ఆ డ్రామాల్ని తెలుసుకోవాలన్నారు. తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదన్న ఆయన.. పార్టీని విడిచి రాజీనామా చేయని ఏ ఎమ్మెల్యేను కానీ.. ఎంపీని కానీ నంద్యాలలో అడుగుపెట్టనీయొద్దని పిలుపునిచ్చారు. చక్రపాణి రెడ్డి ఆవేశ పూరిత ప్రసంగానికి నంద్యాల సభకు హాజరైన ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం గమనార్హం.

No comments:

Post a Comment