02 August 2017

మాజీ మంత్రికి పొగబెడుతున్న తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీ వైఖరితో ఇన్నాళ్లు రాష్ట్రస్థాయి నాయకుల్లో నెలకొన్న అంతర్గత కల్లోలాలు ఇప్పుడు స్థానిక నేతల స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ చీలికతో మంత్రి - ఎంపీ స్థాయి నాయకులు తమదైన శైలిలో వ్యూహాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత లక్ష్యంగా ఎంపీ మాగంటి బాబు వ్యూహం పన్నుతున్నారని తెలుస్తోంది. చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో ఎంపీ - మాజీ మంత్రి వర్గీయుల పంచాయతీ తారాస్థాయికి చేరినట్లు సమాచారం.
తన వర్గం మనుషులకే మార్కెట్ కమిటీ పదవి ఇప్పించుకునేందుకు మాజీ మంత్రి ప్రయత్నిస్తుండటంతో మండిపడ్డ స్థానిక టీడీపీ నేతలు ఎంపీని ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఆయన తెరవెనుకగా మంత్రికి వ్యతిరేకంగా పావులు కదిపినప్పటికీ తాజాగా నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా జంగారెడ్డి గూడెం తాజాగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి వర్గం మంగళవారం మరోసారి సమావేశమైంది. ఎమ్మెల్యే పీతల సుజాత లక్ష్యంగా ఈ సమావేశంలో నేతల ప్రసంగాలు సాగాయి. జంగారెడ్డిగూడెం మండల పట్టణ కమిటీల నియామకం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న దేశం నేతలు త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. టౌన్ హాల్ లో జరిగిన తొలి సమావేశానికి వచ్చినంత మంది నేతలు ఈ సమావేశానికి రాకపోయినప్పటికీ పార్టీ సీనియర్ - జిల్లా ఉపాధ్యక్షుడు మండవ లక్ష్మణరావు నాయకత్వాన్ని బలపరుస్తూ పట్టణంలోను రూరల్ మండలంలో ముఖ్యమైన 25 మంది నేతలు హాజరయ్యారు. జడ్పీటిసి శీలం రామచంద్రరావు కూడా సమావేశానికి హాజరుకావడం గమనార్హం. పట్టణ మండల కమిటీలను ఐవిఆర్ఎస్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్ళిన నేతలు ఎమ్మెల్యే సుజాత మంత్రికి ఇచ్చిన హామీ మేరకు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరించకపోవడంతో ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు దేశం నేతలు పెనుమర్తి రామ్ కుమార్ - అబ్బిన దత్తాత్రేయ - మద్దిపాటి నాగేశ్వరరావు - చిట్రోజు తాతాజి - పెసరగంటి జయరాజు - మందపల్లి లక్ష్మయ్య - గుమ్మడి వెంకటేశ్వరరావు - ముళ్ళపూడి శ్రీనివాసరావు - చాట్రాతి సత్యనారాయణ - పులపాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి మాజీ మంత్రి ఒంటెద్దు పోకడలను చర్చించనున్నట్లు అసంతృప్త నేతలు చెప్తున్నారు.

No comments:

Post a Comment