11 August 2017

మోడీ చెప్పిన వెంకయ్య స్పెషాలిటీ

సుదీర్ఘ విరామం తర్వాత తెలుగోడు అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. అప్పుడెప్పుడో పీవీ నరసింహరావు ప్రధాని పీఠం మీద కూర్చున్న ముచ్చట తెలిసిందే. ఆ తర్వాత ఇప్పటివరకూ మరో తెలుగోడికి అత్యున్నత స్థానం దక్కింది లేదని చెప్పాలి. ప్రోటోకాల్ ప్రకారం చూస్తూ దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు తెలుగు నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు. భారత 13వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సంబంధించిన అరుదైన రికార్డును ప్రధాని మోడీ ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన వ్యక్తి ఒకరు ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టటం ఇదే తొలిసారన్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని ప్రధాని మోడీ సభలో ప్రస్తావించారు. మోడీ నోటి నుంచి వచ్చిన ఈ మాట విన్నవెంటనే రాజ్యసభ సభ్యులంతా చప్పట్లతో తమ హర్షాతిరేకాల్ని వ్యక్తం చేశారు. 1949 జులై 1న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్లో వెంకయ్య చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నేరుగా రాజ్యసభకు వెళ్లిన వెంకయ్య రాజ్యసభ ఛైర్మన్ స్థానంలో కూర్చున్నారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ప్రధాని మోడీ.. విపక్ష నేత గులాం నబీ అజాద్ తో సహా ఇతర సభ్యులు అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన వారు ఉప రాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్యనాయుడిగా చెప్పారు. ఇదో అరుదైన సందర్భం.. కేంద్రమంత్రిగా వెంకయ్య దేశానికి ఎంతో సేవ చేశారన్నారు.ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం విజయవంతం అయిందంటే అందుకు వెంకయ్యను మాత్రమే అభినందించాలన్నారు. ఇన్నాళ్లు తమలో న్యాయవాదిగా ఉండి ఈ రోజు న్యాయమూర్తి స్థానంలో వెంకయ్య కూర్చున్నారన్నారు.

No comments:

Post a Comment