11 August 2017

శిల్పా రాజీనామాపై ఇప్పుడప్పుడే తేల్చరా?

శిల్పా బ్రదర్స్లో చిన్నవాడైన శిల్పా చక్రపాణి రెడ్డి.. ఇటీవల నంద్యాలలో జరిగిన వైసీపీ బహిరంగ సభ సందర్భంగా పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన జగన్ మాటకు కట్టుబడి.. నైతిక విలువలకు తలవంచుతూ.. పదవుల కోసం పాకులాడకుండా తనకు టీడీపీ హయాంలో లభించిన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. వేదిక మీదే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. అదికూడా మండలి చైర్మన్ ఫార్మాట్ లోనే శిల్పా రాజీనామా చేసి.. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలకు గట్టి బుద్ధి చెప్పి.. నేటి తరం రాజకీయాలకు ఆదర్శంగా కూడా నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో శిల్పా సాహసానికి అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నైతికత - నైతిక విలువలు అని చెప్పుకోవడంతో సరిపుచ్చకుండా.. వాటిని తాను పాటిస్తూ.. తన వారితో పాటించేలా చేస్తున్న జగన్ కి జనాలు జైకొట్టారు. ఈ పరిణామం నిజంగా టీడీపీని చాలా చిక్కుల్లోకి నెట్టింది. నైతికత అనే పేరు ఎత్తడం కానీ నిజాయితీ అనే మాట అనేందుకు కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన చక్కటి ప్లాన్ వేశాడు. శిల్పా సమర్పించిన రాజీనామా విషయంలో మైండ్ గేమ్ కి తెరతీయాలని తన మందీ మార్బలాన్ని ప్రోత్సహించాడు. ఇంకేముంది.. అధినేత కనుసన్నల్లో పనిచేస్తూ.. ఆయన మెప్పుకోసం ఉవ్విళ్లూరే.. తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు శిల్పా చక్రపాణి బహిరంగ వేదికగా చేసిన రాజీనామాపై మైండ్ గేమ్ కి తెరతీశారు. వాస్తవానికి శిల్పా తన పదవికి రాజీనామా చేసి.. దానిని ఫ్యాక్స్ ద్వారా మండలి చైర్మన్ కి పంపారు. అదేసమయంలో శాసన మండలి కార్యదర్శికి కూడా ఈ లేఖ పంపించారు. అయితే ప్రస్తుతం మండలికి చైర్మన్ లేనందున డిప్యూటీ చైర్మన్ దీనిని ఆమోదించే వీలుంది. అయితే ఇక్కడే టీడీపీ నేతలు నాటకానికి తెరతీశారు. ప్రస్తుతానికి శిల్పా రాజీనామాను పెండింగ్ లో పెడతారని ఒకవేళ నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి ఓడిపోతే.. తిరిగి అన్నదమ్ములు ఇద్దరూ టీడీపీ గూటికే చేరిపోవడం ఖాయమని ఈ క్రమంలో ఇక తిరిగి తన ఎమ్మెల్సీని చక్రపాణి తీసుకుంటారని రాజీనామా రద్దు కోరతారని టీడీపీ నేతలు కొన్ని మీడియాకు లీకులిస్తున్నారు. రాజీనామా చేసిందీ లేనిదీ చక్రపాణిరెడ్డిని పిలిపించి మాట్లాడడం లేదా ఫోన్ లో మాట్లాడి నిర్ధారించుకోవలసి ఉంటుందని కూడా తమ్ముళ్ల కొత్తగా సూత్రీకరిస్తున్నారు. నిజానికి ఇదేమీ దొంగచాటుగానో.. పైపైకి జగన్ మెప్పుకోసమో చక్రపాణి చేసింది కాదు. నిజంగానే నైతికతకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారు. అదికూడా మండలి చైర్మన్ ఫార్మాట్ లో పంపారు. కాబట్టి.. దీనిని మళ్లీ పోస్ట్ మార్టమ్ చేయాలని భావించడం నిజంగా మైండ్ గేమేనని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే శిల్పా ఓ నిర్ణయం తీసుకున్నారని దానిని గౌరవంగా ఆమోదించకుండా.. టీడీపీ నేతలు ఇలా కొర్రులు పెట్టడం వారిలోని అనైతికతను తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. సో.. ఇలా టీడీపీ నేతలు మైండ్ గేమ్కి తెరతీశారన్నమాట.

No comments:

Post a Comment