03 August 2017

వెనక్కి వెళ్లమన్న చైనాకు నో చెప్పిన భారత్

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తన చుట్టూ ఉన్న దేశాల్లోకి ఏదో రకంగా చొచ్చుకుపోయే దుర్మార్గ లక్షణం ఉన్న చైనా.. ఇటీవల కాలంలో చికెన్ నెక్ మీద దృష్టి పెట్టిన వైనం తెలిసిందే. చికెన్ నెక్ మీద పట్టు పెంచుకోవటం ద్వారా భారత్ మీద అధిపత్యం ప్రదర్శించాలన్న చావు తెలివితేటల్ని ప్రదర్శిస్తున్న చైనాకు డోక్లాం ఉదంతంలో భారత్ గట్టిగా ఉండటం డ్రాగన్కు ఒక పట్టాన మింగుడుపడనిదిగా మారింది. డోక్లామ్ ఇష్యూలో భారత్ కు సంబంధం లేదని.. అది కేవలం తమకు.. భూటాన్ కు మాత్రమే సంబంధమని భారత్ ను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తోంది చైనా. గడిచిన కొద్దికాలంగా డోక్లాం వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వేళ.. తాజాగా మరోసారి డ్రాగన్ విషాన్ని చిమ్మింది. డోక్లామ్ సరిహద్దుల నుంచి భారత దళాలు వెనక్కి వెళ్లాలని.. లేకుంటే కఠినమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న బెదిరింపులకు దిగింది. భారత దళాలు.. చైనా భూభాగంలోకి ప్రవేశించాయని.. వెంటనే వెనక్కి వెళ్లాలంటూ మాటలు మీరుతోంది. ఇందుకు సంబంధించి 15 పేజీల డాక్యుమెంట్ ను విడుదల చేసింది. అందులో పలు ఆరోపణలు చేసింది. జూన్ 18న 270 మంది భారత సైనికులు చైనా భూభాగంలోకి వంద మీటర్లు లోనికి వచ్చినట్లుగా పేర్కొంది. ఒక సందర్భంలో భారత సరిహద్దు బృందాలు ఒక బుల్డోజర్ చైనా భూభాగంలోకి వచ్చేశాయని.. 40 మంది భారత సరిహద్దు బృందాలు మూడు టెంట్లు వేసుకున్నట్లుగా పేర్కొంది. చైనా భూభాగంలోకి అక్రమంగా వస్తే సహించేది లేదన్న చైనా.. డోక్లాం నుంచి భారత్ దళాల్ని వెనక్కి పంపించి.. భూటాన్ లాంటి బుజ్జి దేశానికి చెందిన కీలక ప్రాంతం మీద పట్టు సాధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పాలి. ఇదే విషయాన్ని నేరుగా కాకున్నా.. డోక్లాం ఎపిసోడ్ లో భారత్ కు ఎలాంటి సంబంధం లేదని.. అదంతా చైనా-భూటాన్ సరిహద్దు వివాదంగా చెప్పుకొచ్చింది. ఈ విషయంలో భారత్ అస్సలు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని వెల్లడించింది. చైనా-భారత్- భూటాన్ సరిహద్దుల్లోని ట్రైజంక్షన్ నుంచి భారత దళాలు వెనక్కి వెళ్లాలంటూ గతంలోనూ డ్రాగన్ పేర్కొంది. అయితే.. చైనా హెచ్చరికల్ని భారత సైనిక బృందం ఏ మాత్రం ఖాతరు చేయటం లేదు. అంతేకాదు.. గతానికి భిన్నంగా చైనా వ్యాఖ్యలకు భారత్ ధీటు వ్యాఖ్యలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా చేసే బెదిరింపులకు లొంగేది లేదన్న కచ్ఛితమైన తీరును ప్రదర్శిస్తూ.. సరిహద్దుల నుంచి తమ దళాలు వెనక్కి తగ్గేదే లేదంటూ భారత్ స్పష్టం చేయటం గమనార్హం.

No comments:

Post a Comment