26 July 2017

సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా

పట్నా: మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించనిరీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళిన సీఎం నితీశ్‌ తన రాజీనామాను గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠికి అందజేశారు. నితీశ్‌కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లాలు ప్రసాద్‌ తనయుడు తేజస్విపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో అధికార మహాకూటమిలో మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్‌కుమార్‌ అల్టిమేటం జారీచేశారు. ఈ అల్టిమేటాన్ని లాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తన కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగి తీరుతారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించనిరీతిలో నితీశ్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేసి.. ఆర్జేడీతో దోస్తీని తెగదెంపులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్‌ అడుగులు ఎటువైపు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో మొదటినుంచి బీజేపీ నితీశ్‌కు అండగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో నితీశ్‌కుమార్‌ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని తెలుస్తోంది.

No comments:

Post a Comment