02 August 2017

మాజీ మంత్రికి పొగబెడుతున్న తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీ వైఖరితో ఇన్నాళ్లు రాష్ట్రస్థాయి నాయకుల్లో నెలకొన్న అంతర్గత కల్లోలాలు ఇప్పుడు స్థానిక నేతల స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ చీలికతో మంత్రి - ఎంపీ స్థాయి నాయకులు తమదైన శైలిలో వ్యూహాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత లక్ష్యంగా ఎంపీ మాగంటి బాబు వ్యూహం పన్నుతున్నారని తెలుస్తోంది. చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో ఎంపీ - మాజీ మంత్రి వర్గీయుల పంచాయతీ తారాస్థాయికి చేరినట్లు సమాచారం.
తన వర్గం మనుషులకే మార్కెట్ కమిటీ పదవి ఇప్పించుకునేందుకు మాజీ మంత్రి ప్రయత్నిస్తుండటంతో మండిపడ్డ స్థానిక టీడీపీ నేతలు ఎంపీని ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఆయన తెరవెనుకగా మంత్రికి వ్యతిరేకంగా పావులు కదిపినప్పటికీ తాజాగా నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా జంగారెడ్డి గూడెం తాజాగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి వర్గం మంగళవారం మరోసారి సమావేశమైంది. ఎమ్మెల్యే పీతల సుజాత లక్ష్యంగా ఈ సమావేశంలో నేతల ప్రసంగాలు సాగాయి. జంగారెడ్డిగూడెం మండల పట్టణ కమిటీల నియామకం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న దేశం నేతలు త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. టౌన్ హాల్ లో జరిగిన తొలి సమావేశానికి వచ్చినంత మంది నేతలు ఈ సమావేశానికి రాకపోయినప్పటికీ పార్టీ సీనియర్ - జిల్లా ఉపాధ్యక్షుడు మండవ లక్ష్మణరావు నాయకత్వాన్ని బలపరుస్తూ పట్టణంలోను రూరల్ మండలంలో ముఖ్యమైన 25 మంది నేతలు హాజరయ్యారు. జడ్పీటిసి శీలం రామచంద్రరావు కూడా సమావేశానికి హాజరుకావడం గమనార్హం. పట్టణ మండల కమిటీలను ఐవిఆర్ఎస్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్ళిన నేతలు ఎమ్మెల్యే సుజాత మంత్రికి ఇచ్చిన హామీ మేరకు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరించకపోవడంతో ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు దేశం నేతలు పెనుమర్తి రామ్ కుమార్ - అబ్బిన దత్తాత్రేయ - మద్దిపాటి నాగేశ్వరరావు - చిట్రోజు తాతాజి - పెసరగంటి జయరాజు - మందపల్లి లక్ష్మయ్య - గుమ్మడి వెంకటేశ్వరరావు - ముళ్ళపూడి శ్రీనివాసరావు - చాట్రాతి సత్యనారాయణ - పులపాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి మాజీ మంత్రి ఒంటెద్దు పోకడలను చర్చించనున్నట్లు అసంతృప్త నేతలు చెప్తున్నారు.

బాబుకు దిమ్మ తిరిగిపోయేలా మరో షాక్...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో బాబు తీసుకున్న నిర్ణయానికి ఆయన భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూమా వర్గానికి.. శిల్పా వర్గానికి నడుస్తున్న రాజకీయ వైరంలో బాబు భూమా వర్గానికి తలొగ్గటం.. శిల్పాను పక్కన పెట్టటం తెలిసిందే. దీంతో.. చిన్నబుచ్చుకున్న శిల్పా జగన్ పార్టీలో చేరుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నంద్యాల అసెంబ్లీలో మాంచి పట్టు ఉన్న శిల్పా మోహన్ రెడ్డి పార్టీ నుంచి వీడిపోవటమే కాదు.. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రత్యర్థిగా మారటం ఇబ్బందికరంగా మారింది. దీంతో.. నంద్యాల స్థానాన్ని చేజిక్కించుకోవటం కోసం ఆయన కిందామీదా పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున హామీలు ఇవ్వటం.. ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటం విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు మరో భారీ షాక్ తగిలింది. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు.. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి అన్నబాటలో పయనించాలని నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు.. అనుచరుల సలహా మేరకు ఆయన ఏపీ అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రేపు (గురువారం) నంద్యాలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ఏపీ విపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీ చేరనున్న నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ కోసం ఎంతగానో పని చేస్తున్నా.. పట్టించుకోకుండా నిన్నా మొన్న వచ్చిన వారికి పెద్దపీట వేయటం పట్ల శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు.. అనుచరులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీలో ఉన్నంత కాలం అవమానాలు తప్పేటట్లు లేవని.. అందుకే గౌరవంగా ఉండే చోట ఉందామంటూ మండిపడిన వారు.. పార్టీ మారాలన్న నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. దీంతో.. జగన్ పార్టీలోకి చేరేందుకు శిల్పా చక్రపాణిరెడ్డి సిద్ధమయ్యారని చెప్పాలి.

ఫిరాయింపులపై జగన్ మార్కు అస్త్రం ఇదే!

తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే కాకుండా... రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. ఒక పార్టీ టికెట్ పై ప్రజా ప్రతినిధిగా గెలిచి ఆ తర్వాత ఇంకో పార్టీ తాయిలాలకు లొంగిపోయి ఆ పార్టీ మారుతున్న నేతలు చాలా మందినే మనం చూశాం. అయితే ఈ తరహా పార్టీ ఫిరాయింపులపై చట్టంలో చాలా నిబంధనలే ఉన్నాయి. ఏ పార్టీ టికెట్ పై అయితే ప్రజాప్రతినిధిగా విజయం సాధించారో ఆ పార్టీని వీడాలంటే... ఆ పార్టీ టికెట్ ద్వారా దక్కిన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అలా కాకుండా ఒక పార్టీ నుంచి దక్కిన పదవిని ఇంకో పార్టీలో కూడా చేరి అనుభవిస్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు. అలాంటి కుటిల రాజకీయాలకు చెక్ చెప్పేందుకు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం పదవి ఇచ్చిన పార్టీని వీడకుండానే ఇంకో పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధిపై అనర్హత వేటు వేయాలి. పార్టీ ఫిరాయించిన వారు రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులైతే... ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ - ఎమ్మెల్సీల విషయంలో మండలి చైర్మన్ ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు అటు తెలంగాణలోనే కాకుండా ఇటు ఏపీలోనూ భారీ ఎత్తున విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేయకుండానే అధికార పార్టీల్లో చేరిపోయారు. ఇలా పార్టీలు ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సదరు నేతలకు టికెట్లిచ్చి గెలిపించిన పార్టీలు ఫిర్యాదు చేసినా స్పందన లభించని వైనం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు తాను ఎంతో దూరంగా ఉంటానంటూ ఏపీలో విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తనకు దక్కిన ఎంపీ పదవితో పాటు తన తల్లి విజయమ్మకు దక్కిన ఎమ్మెల్యే పదవిని త్రుణప్రాయంగా వదిలేసుకున్నారు. తిరిగి తన సొంత పార్టీ టికెట్లపై ఉప ఎన్నికల్లో నిలిచి బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించారు. అంతేనా... నాడు ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి వచ్చిన ప్రజా ప్రతినిధులతో రాజీనామాలు చేయించిన జగన్... ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలకు స్వచ్ఛందంగా ముందుకెళ్లారు. విజయఢంకా మోగించారు. ఒకటి అరా స్థానాల్లో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆయన ఏమాత్రం అధైర్య పడలేదు. ఫిరాయింపులపై తనను వేలెత్తి చూపే అవకాశం రాకుండా జగన్ వ్వవహరిస్తున్న తీరు నిజంగానే ఆదర్శంగా ఉందనే చెప్పాలి. నాడు సానుభూతి పవనాలు వీచి జగన్ గెలిచారన్న వైరి వర్గాల ఆరోపణలను ఏమాత్రం లెక్కచేయని జగన్... నాటి నుంచి కూడా ఫిరాయింపులపై అదే వైఖరితో ముందుకు సాగుతున్నానని చెప్పేందుకు మరో తాజా నిదర్శనం వెలుగులోకి వచ్చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని జగన్ ఖరారు చేశారు. తాజాగా శిల్పా సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమైపోయారు. మొన్నటిదాకా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన చక్రపాణిరెడ్డి... మోహన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆది నుంచి ఎక్కడ ఉన్నా అన్నాతమ్ముళ్లిద్దరూ ఒకే వైపు ఉంటూ వచ్చిన శిల్పా సోదరులు... ఈ నాలుగైదు నెలలు మాత్రమే వేర్వేరు వర్గాల్లో ఉండిపోయారు. అయితే ఇక అలా ఉండటం కుదరదని భావించిన వారిద్దరూ కలిసే ముందుకు సాగాలని టీడీపీలో జరిగిన అవమానాలు ఇక చాలని వైసీపీలోనే ఉండిపోదామని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శిల్పా సోదరులు చక్రపాణి చేరికపై జగన్ తో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ నుంచి వారికి ఓ స్పష్టమైన సందేశం అందినట్లు సమాచారం. ఆ సందేశానికి సరేనన్న శిల్పా బ్రదర్స్... వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జగన్ ఆదేశానుసారం అటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి... టీడీపీ నుంచి తనకు దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఈ సింగిల్ స్టెప్ తో జగన్... ఎన్నికలు - నీతివంతమైన రాజకీయాల్లో తనకు ఎంతగా గౌరవముందో ఇట్టే చెప్పేసినట్టైంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు నంద్యాలకు ఉప ఎన్నిక రావడానికి కారణం దివంగత నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణమే. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా గుండెపోటు కారణంగా చనిపోయారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించిన భూమా... ఆ తర్వాత అధికార పార్టీ తాయిలాలకు లొంగిపోయి టీడీపీలో చేరిపోయారు. నాడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురు - ఇప్పటి మంత్రి భూమా అఖిలప్రియను కూడా ఆయన తన వెంట టీడీపీలోకి తీసుకెళ్లారు. నాడు వీరిద్దరితో పాటు టీడీపీలో చేరిన తమ ఎమ్మెల్యేలు 20 మందికి కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... స్పీకర్ కార్యాలయం నుంచి స్పందన వచ్చిన దాఖలానే కనిపించలేదు. ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలకు మీరెలా రెడ్ కార్పెట్ పరుస్తారంటూ దూసుకువచ్చే ప్రశ్నలకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మౌనమే సమాధానంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో జగన్ ధైర్యం ముందు చంద్రబాబు తేలిపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా హోరాహోరీగా ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నికకు ముందు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీకి నిజంగానే భారీగానే దెబ్బ పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

26 July 2017

టెకీలకు డ్రగ్స్..టీ సర్కారు రియాక్షన్ ఇది

హైదరాబాద్ లో రేకెత్తిస్తున్న డ్రగ్స్ వ్యసనం - ఉపయోగించే దందాలో సినీ పరిశ్రమతో పాటుగా సాఫ్ట్ వేర్ నిపుణులు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అయ్యాయి. ఐటీ రంగంలో డ్రగ్స్ ఉపయోగించడంఫై ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. సిట్ విచారణకు బాధ్యత వహిస్తున్న అకున్ సబర్వాల్ ఏ ఏ ఐటీ కంపెనీల ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారో లిస్టు ఇచ్చారని జయేశ్ రంజన్ తెలిపారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లు ఇవ్వలేదని వివరించారు. అందుకే ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నామని వివరించారు. కొద్ది మందిని ఇక్కడికి పిలిపించుకుంటున్నామని వివరించారు. మరి కొన్ని చోట్లకు తానే వెళ్లి మాట్లాడుతున్నానని జయేశ్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలోని కంపెనీలకు ఆయ కంపెనీల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరినట్లు జయేశ్ రంజన్ వెల్లడించారు. తప్పు చేసిన వారిఫై చర్యలు తీసుకోవాలని చెప్పామని ఆయన వివరించారు. హైదరాబాద్ లో దాదాపుగా 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని సుమారు 400 కంపెనీ లు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్నవారు 20 మంది కూడా లేరని ఆయన అన్నారు. తాజాగా డ్రగ్స్ ఉదంతం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఐటీ రంగం సంక్షోభం లో పడిందని భావించొద్దని ఆయన కోరారు. ఈ అంశాన్ని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోరారు. మొత్తం ఐటీ రంగం డ్రగ్స్ తీసుకుంటుందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఐటీ శాఖ కార్యదర్శి అన్నారు.

సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా

పట్నా: మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించనిరీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళిన సీఎం నితీశ్‌ తన రాజీనామాను గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠికి అందజేశారు. నితీశ్‌కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లాలు ప్రసాద్‌ తనయుడు తేజస్విపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో అధికార మహాకూటమిలో మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్‌కుమార్‌ అల్టిమేటం జారీచేశారు. ఈ అల్టిమేటాన్ని లాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తన కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగి తీరుతారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించనిరీతిలో నితీశ్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేసి.. ఆర్జేడీతో దోస్తీని తెగదెంపులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్‌ అడుగులు ఎటువైపు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో మొదటినుంచి బీజేపీ నితీశ్‌కు అండగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో నితీశ్‌కుమార్‌ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని తెలుస్తోంది.

జియో ఫ్రీ ఫోన్లపై షాకింగ్ న్యూస్!

కర్లో దునియా ముట్టీ మే అంటూ రిలయన్స్ పోన్లు కొద్ది సంవత్సరాల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన జియో దెబ్బకు మొబైల్ డేటా వాడకంలో 150వ స్థానంలో ఉన్న భారత్ ఏకంగా నెం.1 స్థానానికి ఎగబాకింది. అదే తరహాలో కొద్ది రోజుల క్రితం జియో ఫోన్లను ఫ్రీగా అందించనున్నామని ముకేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో భారత టెలికం రంగంలో కలకలం రేపారు. రూ. 1500 డిపాజిట్ చేసి రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ సొంతం చేసుకుంటే మూడేళ్ల తరువాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఫ్రీ ఫోన్ల విషయంలో రిలయన్స్ తాజాగా ఓ మెలిక పెట్టింది. రూ. 1500 ఫోన్ పొందిన వినియోగదారులు మూడేళ్ల పాటు ప్రతి నెలా రీచార్జ్ చేసుకుంటేనే పూర్తి మొత్తాన్ని మూడేళ్ల తరువాత వెనక్కు చెల్లిస్తారట. ఒకవేళ మధ్యలో రీచార్జ్ చేసుకోకుంటే పూర్తి మొత్తం ఇవ్వబోమని రిలయన్స్ అధికారులు స్పష్టం చేసినట్టు హెచ్ ఎస్బీసీ వెల్లడించింది. రిలయన్స్ సంస్థ సమావేశం వివరాలను హెచ్ ఎస్బీసీ తాజగా ఓ రిపోర్టులో ప్రచురించింది. జియో ఫోన్ తో పాటే కేబుల్ ప్రసారాలను టీవీలో చూసే సౌకర్యాన్ని కల్పిస్తామని రిలయన్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఫోన్ కేబుల్ తో టీవీ కనెక్ట్ అయి ఉన్నపుడు మాత్రమే టీవీలో ప్రసారాలను చూడవచ్చు. ఫోన్ ను బయటకు తీసుకువెళితే టీవీలో ప్రసారాలు చూడలేం. దీంతో ఈ కేబుల్ ప్లాన్ పక్కాగా ఫెయిల్ అవుతుందని డీటీహెచ్ సంస్థలు భావిస్తున్నాయి. అంతే కాకుండా ఫోన్ ద్వారా కేబుల్ టీవీ కావాలంటే నెలకు రూ. 309 చెల్లించాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువకే సేవలందిస్తూ ఉండడంతో డీటీహెచ్ సంస్థలు దీమాగా ఉన్నాయి.

రూ.2వేల నోటు ప్రింటింగ్ ఆపారా?

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్ద నోట్లగా చెలామణిలో ఉన్న రూ.500.. రూ.1000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ.. ఆ తర్వాత వాటి స్థానంలో రూ.2వేల నోటును తీసుకురావటం తెలిసిందే. కొద్ది రోజులకే రూ.500 నోటును తీసుకొచ్చినా.. వెయ్యి నోటును పునరుద్ధరించలేదు. ఇదిలా ఉండగా.. త్వరలో రూ.200 నోటును తీసుకురావాలన్న నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి నేపథ్యంలో ఆర్ బీఐ రూ.200 నోట్ల ప్రింటింగ్ ను షురూ చేసింది. అన్ని బాగుంటే ఆగస్టు 15 నాటికి కొత్త రూ.200 నోటును వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. అయితే.. అనుకున్న రీతిలో ప్రింటింగ్ జరగటం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఒకదశలో ఆగస్టు నుంచి దసరా సమయానికి రూ200 నోట్లను తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్న వార్తల స్థానే.. మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. సరికొత్తగా తీసుకు వస్తున్న రూ.200 నోట్ల ప్రింటింగ్ ను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసినట్లుగా సమాచారం. రూ.200 నోట్ల ప్రింటింగ్ ను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 15 నాటికి కొత్త రూ.200 నోటను చెలామణిలోకి తెచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి.. రూ.200 నోట్ల కోసం రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ఆపితే.. కొరత ఏర్పడుతుందా? దాని వల్ల జరిగే ఇబ్బంది ఏమిటన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. మిగిలిన ముచ్చట్లు ఎలా ఉన్నా.. మరో మూడు వారాల వ్యవధిలో కొత్త కొత్త రూ.200 నోటు జేబుల్లోకి రావటం ఖాయమన్నట్లేనా?