03 August 2017

జగన్ పేల్చిన తూటాలు ఇవే!

ఉప ఎన్నికలు ఎప్పుడు.. ఎక్కడ వచ్చినా అధికారపక్షానికి సానుకూలంగా ఉండటం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. మళ్లీ.. అలాంటి ప్రత్యేక పరిస్థితులు తాజాగా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.సార్వత్రిక ఎన్నికల వేళలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి.. కాలక్రమంలో అవకాశవాద రాజకీయాల కోసం పార్టీని విడిచి పెట్టి ఏపీ అధికారపక్షం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం గుండెపోటుగా ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగితే.. ఏపీ అధికారపక్ష తరఫున భూమా అవినాశ్ రెడ్డి బరిలోకి దిగారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు నంద్యాల నియోజకవర్గ ప్రజలు భారీగా హాజరయ్యారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు రాక్షస పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన జగన్ ఏమన్నారు? ఏయే అంశాల్ని ప్రస్తావించారు? అన్న విషయాల్ని ఆయన మాటల్లోనే చెబితే.. = నంద్యాలలో జరుగుతుంది ఉప ఎన్నిక కాదు.. ధర్మయుద్ధం. ధర్మానికి అధర్మానికి - న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధం. ఇది విశ్వాస రాజకీయాలకు వంచన రాజకీయాలకు మధ్య జరుగుతున్న యుద్ధం.. మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలపైనా.. కుట్రలు.. అవినీతి పైనా.. అసమర్థ పాలనపైనా ప్రజలు ఇచ్చే తీర్పుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. = చంద్రబాబు దోచుకున్న మూడున్నర లక్షలకోట్లలో కొంత డబ్బు వెదజల్లి పోలీసులను నమ్ముకొని అధికారాన్ని నమ్ముకొని అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. మనుషుల్ని కొనుగోలు చేస్తూ.. చంద్రబాబు చేస్తున్న పాలన మీద చేస్తున్న యుద్ధం ఈ ఉపఎన్నికలు. 2019లో జరగబోయే కురుక్షేత్రం సంగ్రామానికి నాంది ఈ ఎన్నికలు. ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర. ప్రజలు ఆయుధం పట్టనక్కర్లేదు.. యుద్ధం చేయనక్కర్లేదు.. తమ చూపుడు వేలితో ఈవీఎం అనే విష్ణు చక్రం తిప్పుతూ చంద్రబాబు కౌరవ సామ్రాజ్యం కూకటి వేళ్లతో పెకలించాలి. = ఏ మతాన్ని చూసుకున్నా.. భగవద్గీత - బైబిల్ - ఖురాన్ చదివినా అవి చెప్పేది ఒకటే. ధర్మం న్యాయం గొప్పవని చెబుతాయి. ఖురాన్ తెలిపే మహ్మద్ ప్రవక్త గురించి మీకు ఓ కథ చెబుతున్నాను. ‘మహ్మద్ ప్రవక్తను హత్య చేసేందుకు కుట్ర దారులంతా ఒక చోట ఏకమవుతారు. సత్య సందేశాన్ని సహించలేని వీరంతా దారుల్ నాదువాలో సమావేశం అయ్యి హత్య గురించి చర్చిస్తారు. అక్కడ రెండు మూడు ప్రతిపాదనలు పెడతారు. చివరగా అబూ జహన్ అనే కుట్రదారుడు చేసిన ప్రతిపాదన అందరికీ నచ్చుతుంది.. అదేమిటంటే అన్ని తెగల నుంచి పలుకుబడి ఉన్న కుటుంబాల్లోని యువకులను ఎంపిక చేసి వారికి కత్తులు ఇచ్చి వారంతా కూడా మహ్మద్ ప్రవక్త మీద దాడి చేస్తే నేరం అందరిపై పడుతుంది. అలా జరిగితే అందరిపై పోరాడలేరు. పరిహారం ఇవ్వాలని మాత్రమే అడుగుతారని చెప్పగా ఇది అందరికి నచ్చుతుంది. దీంతో అలాగే యువకులను ఎంపిక చేసి మహ్మద్ ప్రవక్తను హత్య చేసేందుకు ప్రవక్త ఇంటిని చుట్టు ముడతారు. ఆ విషయం జబ్రీల్ అనే దైవదూత ద్వారా తెలుసుకొని చిరునవ్వు నవ్వుతూ ఇసుక తీసుకొని హత్య చేసేందుకు వచ్చినవారి తలలపై జల్లుతూ నవ్వుతూ వెళ్లిపోతారు. ఆ సమయంలో వారు ఏం చేయలేక తలలు వంచుతారు. దీనర్ధం ఏమిటంటే దొంగదెబ్బతీసేవారు.. వెన్నుపోటు పొడిచేవారు ధర్మం ముందు తల వంచాల్సిందే. ఇదే విషయాన్ని ఖురాన్ చెబుతోంది. = అబద్ధాలతో తాత్కాలిక విజయం రావొచ్చు.. కానీ సత్యవంతులదే విజయం అని ఖురాన్ అని చెబుతుంది. అన్ని మతాలు కూడా ఇదే చెబుతాయి. ఏ మతమైనా తప్పును తప్పంటుంది.. దొంగను దొంగేనని మోసాన్ని మోసమేనని చెబుతుంది. = సీతమ్మను దొంగతనంగా ఎత్తుకుపోయిన రావణుడిని రాక్షసుడు అంటాం.. మన పొలం పంటను మన ఆస్తిని ఎత్తుకుపోయినవారిని దొంగ అంటాం. మన పిల్లల్ని ఎత్తుకొని పోయేవాడిని బూచాడని అంటాం. మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లిన వారిని ఏమనాలి? వారిని ఎత్తుకుపోయిన చంద్రబాబునాయుడిని ఏమనాలి? దొంగ అంటామా? సీఎం అని అంటామా..? ఇది దొంగల పాలన అంటామా? ప్రజల పాలన అంటామా? సొంతమామనే వెన్నుపోటు పొడిచి ఆయన కష్టంతో వచ్చిన ఆయన పదవిని ఆయన పార్టీ గుర్తును లాగేసుకున్న వ్యక్తిని ఏమంటాం? = మిగితా పార్టీల్లో చిచ్చుపెట్టే వ్యక్తిని ఏమంటాం? ప్రజలను వెన్నుపోటు పొడిచే వ్యక్తిని ఏమంటాం? అప్పట్లో చంద్రబాబును ఉదహరిస్తూ నాన్నగారు వైఎస్ఆర్ ఓ కథ చెప్పేవారు. అనగనగా ఓ ముద్దాయి ఉండేవాడు. అతడు కోర్టు బోనులో ఉన్నాడు. జడ్జి రాగానే బోరున ఏడ్వడం మొదులపెట్టాడు. తల్లితండ్రి లేని ఆనాధను వదిలేయండి అన్నాడు.. మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. జడ్జికి బాధ కలిగి లాయర్లను అతడు చేసిన నేరం ఏమిటని అడగ్గా.. పబ్లిక్ప్రాసీక్యూటర్ ఏమన్నారో తెలుసా.. తల్లితండ్రిని చంపిన వ్యక్తి అని చెప్తాడు. ఇది చంద్రబాబు నైజం. చంద్రబాబే తన మామ ఎన్టీఆర్ ను చంపి ఆయనే ఫొటోలు తెచ్చి ఎన్నికలకు వెళతాడు. మొన్నటి వరకు మైనార్టీలను దెబ్బ కొట్టాడు. ఎన్నికలు రాగానే మళ్లీ అదే మైనార్టీలపై లేని ప్రేమను చూపిస్తున్నాడు. రైతులను - డ్వాక్రా అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు. = ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల సంఖ్యను పెంచుతామని హామీ ఇస్తున్నా. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. కానీ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చుతాం. మొత్తం 25 జిల్లాలుగా మారుస్తాం. నంద్యాల పట్టణాన్ని కలెక్టరేట్..ఎస్సీ కార్యాలయాలతో జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 2018లో వచ్చే ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానానికి నంద్యాల నుంచే ముస్లిం మైనారీటికి అవకాశం ఇస్తాం.

జగన్ చేతిలో రాజీనామా లేఖ పెట్టి..బాబుకు షాక్ ....

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాకిస్తూ.. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి జగన్ పార్టీలో చేరనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు తగ్గట్లే తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు శిల్పా చక్రపాణి రెడ్డి. అయితే.. టీడీపీలో ఉన్నప్పుడు తనకొచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటమే కాదు.. ఆ లేఖను వేలాది ప్రజానీకం ఎదుట పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవిని చేపట్టి తాను తొంభై రోజులు కూడా కాలేదన్న ఆయన.. దమ్ముంటే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా తన మాదిరే పదవికి రాజీనామా చేయగలరా? అంటూ సవాలు విసిరారు. బాబు చెప్పిన పని చేయరని.. కానీ.. జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్నారు. ఈ రోజు ఆట మొదలైందని.. ఇక ఏ ఆటకైనా రెఢీ అన్నారు. తనకు అత్యాశ అని చంద్రబాబుకు కుమారుడు.. మంత్రి లోకేశ్ అన్నారని.. అసలు తనకు ఆశే లేదని.. ఇంక అత్యాశ ఎక్కడదని ప్రశ్నించారు. ఎలాంటి త్యాగాలకైనా శిల్పా సోదరులం సిద్ధమన్న చక్రపాణి రెడ్డి.. ప్రజల కోసం ఏమైనా చేస్తామన్నారు. భూమా ఫ్యామిలీ డ్రామా మొదలైందని.. ప్రజలు మాత్రం ఆ డ్రామాల్ని తెలుసుకోవాలన్నారు. తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదన్న ఆయన.. పార్టీని విడిచి రాజీనామా చేయని ఏ ఎమ్మెల్యేను కానీ.. ఎంపీని కానీ నంద్యాలలో అడుగుపెట్టనీయొద్దని పిలుపునిచ్చారు. చక్రపాణి రెడ్డి ఆవేశ పూరిత ప్రసంగానికి నంద్యాల సభకు హాజరైన ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం గమనార్హం.

02 August 2017

మాజీ మంత్రికి పొగబెడుతున్న తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీ వైఖరితో ఇన్నాళ్లు రాష్ట్రస్థాయి నాయకుల్లో నెలకొన్న అంతర్గత కల్లోలాలు ఇప్పుడు స్థానిక నేతల స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ చీలికతో మంత్రి - ఎంపీ స్థాయి నాయకులు తమదైన శైలిలో వ్యూహాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత లక్ష్యంగా ఎంపీ మాగంటి బాబు వ్యూహం పన్నుతున్నారని తెలుస్తోంది. చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో ఎంపీ - మాజీ మంత్రి వర్గీయుల పంచాయతీ తారాస్థాయికి చేరినట్లు సమాచారం.
తన వర్గం మనుషులకే మార్కెట్ కమిటీ పదవి ఇప్పించుకునేందుకు మాజీ మంత్రి ప్రయత్నిస్తుండటంతో మండిపడ్డ స్థానిక టీడీపీ నేతలు ఎంపీని ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఆయన తెరవెనుకగా మంత్రికి వ్యతిరేకంగా పావులు కదిపినప్పటికీ తాజాగా నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా జంగారెడ్డి గూడెం తాజాగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి వర్గం మంగళవారం మరోసారి సమావేశమైంది. ఎమ్మెల్యే పీతల సుజాత లక్ష్యంగా ఈ సమావేశంలో నేతల ప్రసంగాలు సాగాయి. జంగారెడ్డిగూడెం మండల పట్టణ కమిటీల నియామకం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న దేశం నేతలు త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. టౌన్ హాల్ లో జరిగిన తొలి సమావేశానికి వచ్చినంత మంది నేతలు ఈ సమావేశానికి రాకపోయినప్పటికీ పార్టీ సీనియర్ - జిల్లా ఉపాధ్యక్షుడు మండవ లక్ష్మణరావు నాయకత్వాన్ని బలపరుస్తూ పట్టణంలోను రూరల్ మండలంలో ముఖ్యమైన 25 మంది నేతలు హాజరయ్యారు. జడ్పీటిసి శీలం రామచంద్రరావు కూడా సమావేశానికి హాజరుకావడం గమనార్హం. పట్టణ మండల కమిటీలను ఐవిఆర్ఎస్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్ళిన నేతలు ఎమ్మెల్యే సుజాత మంత్రికి ఇచ్చిన హామీ మేరకు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరించకపోవడంతో ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు దేశం నేతలు పెనుమర్తి రామ్ కుమార్ - అబ్బిన దత్తాత్రేయ - మద్దిపాటి నాగేశ్వరరావు - చిట్రోజు తాతాజి - పెసరగంటి జయరాజు - మందపల్లి లక్ష్మయ్య - గుమ్మడి వెంకటేశ్వరరావు - ముళ్ళపూడి శ్రీనివాసరావు - చాట్రాతి సత్యనారాయణ - పులపాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి మాజీ మంత్రి ఒంటెద్దు పోకడలను చర్చించనున్నట్లు అసంతృప్త నేతలు చెప్తున్నారు.

బాబుకు దిమ్మ తిరిగిపోయేలా మరో షాక్...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో బాబు తీసుకున్న నిర్ణయానికి ఆయన భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూమా వర్గానికి.. శిల్పా వర్గానికి నడుస్తున్న రాజకీయ వైరంలో బాబు భూమా వర్గానికి తలొగ్గటం.. శిల్పాను పక్కన పెట్టటం తెలిసిందే. దీంతో.. చిన్నబుచ్చుకున్న శిల్పా జగన్ పార్టీలో చేరుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నంద్యాల అసెంబ్లీలో మాంచి పట్టు ఉన్న శిల్పా మోహన్ రెడ్డి పార్టీ నుంచి వీడిపోవటమే కాదు.. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రత్యర్థిగా మారటం ఇబ్బందికరంగా మారింది. దీంతో.. నంద్యాల స్థానాన్ని చేజిక్కించుకోవటం కోసం ఆయన కిందామీదా పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున హామీలు ఇవ్వటం.. ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటం విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు మరో భారీ షాక్ తగిలింది. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు.. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి అన్నబాటలో పయనించాలని నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు.. అనుచరుల సలహా మేరకు ఆయన ఏపీ అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రేపు (గురువారం) నంద్యాలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ఏపీ విపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీ చేరనున్న నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ కోసం ఎంతగానో పని చేస్తున్నా.. పట్టించుకోకుండా నిన్నా మొన్న వచ్చిన వారికి పెద్దపీట వేయటం పట్ల శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు.. అనుచరులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీలో ఉన్నంత కాలం అవమానాలు తప్పేటట్లు లేవని.. అందుకే గౌరవంగా ఉండే చోట ఉందామంటూ మండిపడిన వారు.. పార్టీ మారాలన్న నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. దీంతో.. జగన్ పార్టీలోకి చేరేందుకు శిల్పా చక్రపాణిరెడ్డి సిద్ధమయ్యారని చెప్పాలి.

ఫిరాయింపులపై జగన్ మార్కు అస్త్రం ఇదే!

తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే కాకుండా... రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. ఒక పార్టీ టికెట్ పై ప్రజా ప్రతినిధిగా గెలిచి ఆ తర్వాత ఇంకో పార్టీ తాయిలాలకు లొంగిపోయి ఆ పార్టీ మారుతున్న నేతలు చాలా మందినే మనం చూశాం. అయితే ఈ తరహా పార్టీ ఫిరాయింపులపై చట్టంలో చాలా నిబంధనలే ఉన్నాయి. ఏ పార్టీ టికెట్ పై అయితే ప్రజాప్రతినిధిగా విజయం సాధించారో ఆ పార్టీని వీడాలంటే... ఆ పార్టీ టికెట్ ద్వారా దక్కిన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అలా కాకుండా ఒక పార్టీ నుంచి దక్కిన పదవిని ఇంకో పార్టీలో కూడా చేరి అనుభవిస్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు. అలాంటి కుటిల రాజకీయాలకు చెక్ చెప్పేందుకు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం పదవి ఇచ్చిన పార్టీని వీడకుండానే ఇంకో పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధిపై అనర్హత వేటు వేయాలి. పార్టీ ఫిరాయించిన వారు రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులైతే... ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ - ఎమ్మెల్సీల విషయంలో మండలి చైర్మన్ ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు అటు తెలంగాణలోనే కాకుండా ఇటు ఏపీలోనూ భారీ ఎత్తున విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేయకుండానే అధికార పార్టీల్లో చేరిపోయారు. ఇలా పార్టీలు ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సదరు నేతలకు టికెట్లిచ్చి గెలిపించిన పార్టీలు ఫిర్యాదు చేసినా స్పందన లభించని వైనం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు తాను ఎంతో దూరంగా ఉంటానంటూ ఏపీలో విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తనకు దక్కిన ఎంపీ పదవితో పాటు తన తల్లి విజయమ్మకు దక్కిన ఎమ్మెల్యే పదవిని త్రుణప్రాయంగా వదిలేసుకున్నారు. తిరిగి తన సొంత పార్టీ టికెట్లపై ఉప ఎన్నికల్లో నిలిచి బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించారు. అంతేనా... నాడు ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి వచ్చిన ప్రజా ప్రతినిధులతో రాజీనామాలు చేయించిన జగన్... ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలకు స్వచ్ఛందంగా ముందుకెళ్లారు. విజయఢంకా మోగించారు. ఒకటి అరా స్థానాల్లో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆయన ఏమాత్రం అధైర్య పడలేదు. ఫిరాయింపులపై తనను వేలెత్తి చూపే అవకాశం రాకుండా జగన్ వ్వవహరిస్తున్న తీరు నిజంగానే ఆదర్శంగా ఉందనే చెప్పాలి. నాడు సానుభూతి పవనాలు వీచి జగన్ గెలిచారన్న వైరి వర్గాల ఆరోపణలను ఏమాత్రం లెక్కచేయని జగన్... నాటి నుంచి కూడా ఫిరాయింపులపై అదే వైఖరితో ముందుకు సాగుతున్నానని చెప్పేందుకు మరో తాజా నిదర్శనం వెలుగులోకి వచ్చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని జగన్ ఖరారు చేశారు. తాజాగా శిల్పా సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమైపోయారు. మొన్నటిదాకా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన చక్రపాణిరెడ్డి... మోహన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆది నుంచి ఎక్కడ ఉన్నా అన్నాతమ్ముళ్లిద్దరూ ఒకే వైపు ఉంటూ వచ్చిన శిల్పా సోదరులు... ఈ నాలుగైదు నెలలు మాత్రమే వేర్వేరు వర్గాల్లో ఉండిపోయారు. అయితే ఇక అలా ఉండటం కుదరదని భావించిన వారిద్దరూ కలిసే ముందుకు సాగాలని టీడీపీలో జరిగిన అవమానాలు ఇక చాలని వైసీపీలోనే ఉండిపోదామని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శిల్పా సోదరులు చక్రపాణి చేరికపై జగన్ తో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ నుంచి వారికి ఓ స్పష్టమైన సందేశం అందినట్లు సమాచారం. ఆ సందేశానికి సరేనన్న శిల్పా బ్రదర్స్... వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జగన్ ఆదేశానుసారం అటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి... టీడీపీ నుంచి తనకు దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఈ సింగిల్ స్టెప్ తో జగన్... ఎన్నికలు - నీతివంతమైన రాజకీయాల్లో తనకు ఎంతగా గౌరవముందో ఇట్టే చెప్పేసినట్టైంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు నంద్యాలకు ఉప ఎన్నిక రావడానికి కారణం దివంగత నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణమే. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా గుండెపోటు కారణంగా చనిపోయారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించిన భూమా... ఆ తర్వాత అధికార పార్టీ తాయిలాలకు లొంగిపోయి టీడీపీలో చేరిపోయారు. నాడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురు - ఇప్పటి మంత్రి భూమా అఖిలప్రియను కూడా ఆయన తన వెంట టీడీపీలోకి తీసుకెళ్లారు. నాడు వీరిద్దరితో పాటు టీడీపీలో చేరిన తమ ఎమ్మెల్యేలు 20 మందికి కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... స్పీకర్ కార్యాలయం నుంచి స్పందన వచ్చిన దాఖలానే కనిపించలేదు. ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలకు మీరెలా రెడ్ కార్పెట్ పరుస్తారంటూ దూసుకువచ్చే ప్రశ్నలకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మౌనమే సమాధానంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో జగన్ ధైర్యం ముందు చంద్రబాబు తేలిపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా హోరాహోరీగా ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నికకు ముందు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీకి నిజంగానే భారీగానే దెబ్బ పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

26 July 2017

టెకీలకు డ్రగ్స్..టీ సర్కారు రియాక్షన్ ఇది

హైదరాబాద్ లో రేకెత్తిస్తున్న డ్రగ్స్ వ్యసనం - ఉపయోగించే దందాలో సినీ పరిశ్రమతో పాటుగా సాఫ్ట్ వేర్ నిపుణులు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అయ్యాయి. ఐటీ రంగంలో డ్రగ్స్ ఉపయోగించడంఫై ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. సిట్ విచారణకు బాధ్యత వహిస్తున్న అకున్ సబర్వాల్ ఏ ఏ ఐటీ కంపెనీల ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారో లిస్టు ఇచ్చారని జయేశ్ రంజన్ తెలిపారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లు ఇవ్వలేదని వివరించారు. అందుకే ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నామని వివరించారు. కొద్ది మందిని ఇక్కడికి పిలిపించుకుంటున్నామని వివరించారు. మరి కొన్ని చోట్లకు తానే వెళ్లి మాట్లాడుతున్నానని జయేశ్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలోని కంపెనీలకు ఆయ కంపెనీల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరినట్లు జయేశ్ రంజన్ వెల్లడించారు. తప్పు చేసిన వారిఫై చర్యలు తీసుకోవాలని చెప్పామని ఆయన వివరించారు. హైదరాబాద్ లో దాదాపుగా 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని సుమారు 400 కంపెనీ లు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్నవారు 20 మంది కూడా లేరని ఆయన అన్నారు. తాజాగా డ్రగ్స్ ఉదంతం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఐటీ రంగం సంక్షోభం లో పడిందని భావించొద్దని ఆయన కోరారు. ఈ అంశాన్ని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోరారు. మొత్తం ఐటీ రంగం డ్రగ్స్ తీసుకుంటుందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఐటీ శాఖ కార్యదర్శి అన్నారు.

సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా

పట్నా: మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించనిరీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళిన సీఎం నితీశ్‌ తన రాజీనామాను గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠికి అందజేశారు. నితీశ్‌కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లాలు ప్రసాద్‌ తనయుడు తేజస్విపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో అధికార మహాకూటమిలో మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్‌కుమార్‌ అల్టిమేటం జారీచేశారు. ఈ అల్టిమేటాన్ని లాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తన కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగి తీరుతారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించనిరీతిలో నితీశ్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేసి.. ఆర్జేడీతో దోస్తీని తెగదెంపులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్‌ అడుగులు ఎటువైపు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో మొదటినుంచి బీజేపీ నితీశ్‌కు అండగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో నితీశ్‌కుమార్‌ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని తెలుస్తోంది.